జగిత్యాల రాజకీయాల్లో వైవిద్యం
దిశ దశ, జగిత్యాల:
బద్ద రాజకీయ వైరుద్యం ఉన్న ఆ ఇద్దరు నాయకులు బౌతికంగా వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. టెక్నికల్ గా మాత్రం ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నట్టుగానే పరిగణించాల్సిందే. పదిహేనేళ్లుగా ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న వీరిద్దరి విషయంలో ఓ వైవిద్యం కనిపిస్తోంది.
జగిత్యాల…
జగిత్యాల రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభందం పెనవేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి తనదైన ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. అభివృద్ది విషయంలో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన డాక్టర్ సంజయ్ కుమార్ ప్రమేయాన్ని బాహాటంగా వ్యతిరేకించిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో జట్టు కట్టేశారు. ఇక అధికారికంగా గులాభి కండువా కప్పుకోవడమే మిగిలింది.
రికార్డుల్లో…
అయితే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినవాడేనని ప్రకటించడంతో ఆయనను అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే పరిగణించాల్సిందే. సంజయ్ కుమార్ ను అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పరిగణిస్తూ పార్టీ సమావేశాల్లో కూడా ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో అసహనం వ్యక్తి చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో చేరాలని వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ నాయకులంతా జీవన్ రెడ్డిని ఆహ్వానించారు. ఆ మరునాడు జీవన్ రెడ్డి, ఎర్రవెల్లి ఫార్మ్ హౌజ్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే లాంఛనం మాత్రమే మిగలగా ఈ కార్యక్రమం ఈ నెల 20న నిర్వహించనున్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమైపోవడంతో ఆయన బీఆర్ఎస్ నాయకునిగానే చెలామణి అవుతన్నట్టుగానే పరిగణించాల్సిందే. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ పేరు అసెంబ్లీ రికార్డుల్లో పదిలంగా ఉండగా గులాభి పార్టీలో మాత్రం జీవన్ రెడ్డి పేరు అధికారికంగా వినిపిస్తోంది. టెక్నికల్ గా చూసినట్టయితే ప్రత్యర్థులు ఇద్దరూ ఇఫ్పుడు కూడా ఒకే పార్టీలో ఉన్న్టట్టే. ఫిజికల్ గా డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకాలాపాల్లో పాలు పంచుకుంటున్నా అధికారికంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని భావించాల్సిందే. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినా అధికారికంగా మాత్రం సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టేనని దీంతో జగిత్యాలకు చెందిన ప్రధాన ప్రత్యర్థులిద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.