దిశ దశ, ఆదిలాబాద్:
ఉపాధి హమీ బిల్లులు ఇచ్చేందుకు కూడా లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. హరిత హారం ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసిన డబ్బులు ఇప్పించేందుకు కూడా చేతులు తడపాల్సిందేనన్న అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ పారెస్ట్ రేంజ్ పరిధిలో ఉపాధి హామీ ద్వారా మొక్కలకు నీటిని సరఫరా చేశారు. ఇందుకు గాను రూ. 5,09,000 బిల్లు మంజూరు చేయాల్సి ఉంది. అయితే ఈ బిల్లులు ఇప్పించాలంటే రూ. 15 వేలు ఇవ్వాల్సిందేనని బోథ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) టి ప్రణయ్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా గురువారం జూనియర్ అసిస్టెంట్ ఎస్ పరుశురాం ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో FRO ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరుశురాంలను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.