దిశ దశ, కరీంనగర్:
మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల పేరిట వేతనాలు డ్రా చేసిన అక్రమ వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ళుగా జీతాలు డ్రా చేస్తున్నట్టుగా బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు డ్యూటీ ఎక్కడ చేస్తున్నారని బిల్లుల తయారు చేశారోనన్న చర్చ సాగుతోంది.
డ్యూటీ పాస్ పోర్ట్…
సాధారణంగా పోలీసు విభాగంలో బదిలీలు, అటాచ్డ్ డ్యూటీల్లో పంపే విధానం కొనసాగుతుంటుంది. ఇతర ప్రభుత్వ విభాగాల్లో డిప్యూటేషన్ మాదిరిగానే పోలీసు విభాగంల అటాచ్డ్ చేసే ఆనవాయితీ అమలు అవుతోంది. అయితే బదిలీ అయిన వారికి సంబంధిత ఉన్నతాధికారుల నుండి ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ విడుదల అవుతాయి ఇందుకు అనుగుణంగానే వారి వేతనాల బిల్లులు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కార్యాయలయాల్లో తయారవుతుంటాయి. అటాచ్డ్ పోస్టింగులో ఉన్న వారు ఎక్కడ పని చేస్తున్నారో సర్టిఫై చేసిన తరువాత అసలు పోస్టింగ్ ఉన్న చో్ట నుండి వేతనాల బిల్లు తయారు చేస్తారు. వీరిని అటాచ్డ్ చేసేప్పుడు సంబంధిత జిల్లా ఎస్పీలు, కమిషనరేట్ అయితే సీపీల అనుమతితో డ్యూటీ పాస్ పోర్టులు జారీ చేస్తుంటారు. అయితే గతంలో చనిపోయిన ముగ్గురు కానిస్టేబుళ్లు సిహెచ్ రవిందర్, కె గంగస్వామి, కె రవిలకు సంబంధించిన ఐడీలను ఉపయోగించి IFMIS పోర్టల్ లో ప్రైవేటు వ్యక్తుల పేర్లను యాడ్ చేశారని పోలీసు అధికారుల విచారణలో తేలింది. అయితే వీరి వేతనాలను డ్రా చేసేందుకు పోర్టల్ లో అప్ లోడ్ చేసిన CPO అడ్మినిస్ట్రేటేషన్ ఆఫీస్ ఉద్యోగులు ఆ ముగ్గురు ఎక్కడ పని చేస్తున్నారని రికార్డుల్లో చూపించారన్న చర్చ సాగుతోంది. అటాచ్డ్ డ్యూటీ అయితే వారు ఏ అదికారి పరిధిలో పని చేస్తున్నారో సదరు అధికారి దృవీకరించాల్సి ఉంటుంది. అధికారితో సంబంధం లేకుండా బిల్లులు తయారు చేసినట్టయితే ఇందుకు సదరు అధికారి వద్ద పని చేసే ఇతర సిబ్బంది వేతనాలు తయారు చేసే ఉద్యోగి సహకారం అయినా ఉండాలి. లేనట్టయితే CPO కార్యాలయం ఉద్యోగులే అటాచ్డ్ డ్యూటీ పాస్ పోర్టులు, విధులు నిర్వర్తిస్తున్నట్టుగా దృవీకరణ పత్రాలు తయారు చేసి ఉంటారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే పోలీసు అదికారులు మరిన్ని కోణాల్లో ఆరా తీస్తే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నవారూ లేకపోలేదు.

