పదుల సంఖ్యలో బృందాలు… వందల సంఖ్యలో బలగాలు…

దొరకని ఐదుగురి ఆచూకి…

దిశ దశ, కరీంనగర్:

కాలు జారడం నేరం కాదు… కారణం తెలుసుకోకపోవడం ఘోరం… కేవలం ఐదుగురంటే ఐదుగురు ఐదు తుపాకులతో వచ్చి కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. రెండు మూడు నెలలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాను చుట్టేసిన దోపిడీ ముఠా పక్కాగా రెక్కీ నిర్వహించుకుని దర్జాగా దోచుకుని వెల్లింది. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో ఉన్న PMJ Jewellery Showroomలోకి చొరబడి దోచుకెళ్లిన తీరు అన్ని వర్గాలను ఆశ్యర్యానికి గురి చేసింది. అయితే దోపిడీ ముఠాను పట్టుకునేందుకు కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, హైదరాబాద్ నగరాలకు చెందిన వివిధ విబాగాల పోలీసులు రంగంలోకి దిగారు. వీరంతా కరీంనగర్ నుండి మధ్యప్రదేశ్ వరకూ జల్లెడ పడుతున్నా ముఠా ఆచూకి మాత్రం దొరకడం లేదు. ముఠా స్వస్థలాలను గుర్తించినప్పటికీ దోపిడీ ముఠా మాత్రం ఇంతవరకూ వారి వారి గ్రామాలకు మాత్రం చేరుకోలేదని తెలుస్తోంది. దాదాపు ఐధు బృందాలు దోపిడీ ముఠాను పట్టుకునే విషయంలో బీహార్ కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 3వ తేది 11.12 గంటలకు షోరూంలో కాల్పులు జరిపి పరార్ అయిన దోపిడీ ముఠా ఎంట్రీ, ఎగ్జిట్ విషయం గురించి తెలుసుకునేందుకు గంటల సమయం పట్టినట్టుగా స్పష్టం అవుతోంది.

స్పందనలో వేగం…

ఆదివారం ఉదయం దోపిడీ గురించి సమాచారం అందిన 9 నిమిషాల్లోనే పోలీసు అధికారులు జ్యువెలరీ షోరూం వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రకటించారు. PMJ Jewellery Showroom వద్దకు పోలీసులు చేరుకునే సమయానికి దోపిడీ ముఠా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోనే ఉండి ఉంటుంది. వెంటనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేసినట్టయితే వారు జిల్లా సరిహద్దులు దాటి పోయే అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం నగల దుకాణం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించినా శాతవాహన యూనివర్శిటీ, మల్కాపూర్ మీదుగా వెళ్లారన్న విషయం తెలిసేది. దీంతో దోపిడీ ముఠా ఏ రూట్ లో వెల్తుందో అన్న అంచనాకు వచ్చే అవకాశం ఉండేది. దీంతో రామడుగు, గంగాధర, చొప్పదండి పోలీసులతో పాటు జగిత్యాల జిల్లా యంత్రాంగాన్ని హై అలెర్ట్ చేస్తే అదే రోజున దోపిడీ ముఠా ఆచూకి లభ్యం అయ్యేది. అంతా అయ్యాక సీసీ కెమెరాల ఆధారంగా పోలీసు అదికారులు తనిఖీలు చేస్తూ వెళ్లారు. చింతకుంట, బావుపేటల మీదుగా దోపిడీ ముఠా ఉనికి బయటపడడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వైపు వెళ్లారని అనుమానించారు. అయితే వారు మాత్రం రామడుగు మండలం మోతె, రుద్రారం మీదుగా రాకపోకలు సాగించారని తేలింది. ధర్మపురి పట్టణంలో రెండు రోజుల పాటు షెల్టర్ తీసుకున్నారన్న విషయం పోలీసులకు ఘటన జరిగిన రెండు రోజుల తరువాత కానీ తెలియలేదు. దోపిడీ ముఠా కదలికలు దొరకడానికే రోజులకొద్ది సమయం పట్టడం గమనార్హం. పోలీసులు ఒక్కో సీసీ కెమెరాను చెక్ చేసుకుుంటూ వెళ్లే సరికే ముఠా సరిహద్దులు దాటిపోయి
ఉంటుందని స్పష్టమవుతోంది. అయితే దోపిడీ, కాల్పులు జరిపిన విషయం పోలీసుు ఉన్నతాధికారులకు క్షణాల్లో తెలియాల్సి ఉన్నప్పటికీ కాస్తా ఆలస్యంగానే సమాచారం చేరిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే నిజమైతే మాత్రం సొంత విభాగం అధికారులతో సమన్వయం చేసుకోలేని పరిస్థితికి చేరుకున్నట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సంచలనంగా మారిన ఈ కేసును సాధారణ నేరంగా పరిగణించడం వల్లే పై అధికారులకు షేర్ చేయలేకపోయి ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఎగ్జామ్ లేకుంటే…

ఆదివారం రోజున NEET ఎగ్జామ్ కారణ:గా పోలీసు అధికారులంతా డ్యూటీలో ఉన్నారు. కరీంనగర్ లోని వివిధ కేంద్రాలలో నిర్వహిస్తున్న ఈ పరీక్షల వద్ద బందోబస్తు డ్యూటీలో ఉండడంతో పోలీసు అధికారులు కేవలం 9 నిమిషాల్లో స్పందించగలిగారు. ఇటీవల కాలంలో ఆదివారం పోలీసులు రెస్ట్ మూడ్ లోకి వెల్తున్న సంగతి అందిరికీ తెలిసిందే. గతంలో ప్రతి రోజూ అప్రమత్తంగా ఉండే పోలీసు అధికారులు సండే నాడు ఇతర శాఖల యంత్రాంగం మాదిరిగానే అనధికారిక సెలవులా ఫీలవుతున్నారు. పోలీసు అధికారులు కూడా వీకెండ్ తమతమ కుటుంబాలతో గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 3న నీట్ ఎగ్జామ్ లేనట్టయితే
పోలీసు అధికారుల నుండి ఆ మాత్రం స్పందన కూడా ఉండకపోయేదేమోనని స్పష్టమవుుతోంది.

నిపుణులేరీ..?

అయితే కరీంనగర్ దోపిడీ ఘటన తరువాత పోలీసు వ్యవస్థలో అనుభవరాహిత్యం స్పష్టంగా కొట్టించింది. గతంలో సీసీఎస్ వంటి విభాగాల్లో దోపిడీ ముఠాల గురించి ఇట్టే పసిగట్టగలిగే సాధారణ కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉండేవారు. వారికి ఉన్న వ్యక్తిగత సంబంధాలతో ముఠాల ఆచూకి దొరకబట్టిన సందర్భాలు కోకొల్లలు. కానీ కరీంనగర్ దోపిడీ తరువాత ఇలాంటి అనుభం ఉన్న వారిని భాగస్వాములను చేసినట్టయితే దొంగల ముఠా కదలికలపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉండేది. 2014 ఫిబ్రవరి 1న చొప్పదండి బ్యాంకు రాబరీ తరువాత పోలీసు అధికారులంతా జరిగిన సంఘటనపై బ్యాంకు అదికారుల నుండి వివరాలు
సేకరిస్తుంటే నేరాలను నియంత్రించడంలో కీలకంగడా పని చేసిన ఓ హెడ్ కానిస్టేబుల్ చొప్పదండి పట్టణ పరిసరాల్లో తిరిగారు. బ్యాంక్ రాబరీకి పాల్పడిన ముఠా చొప్పదండి మండలం భూపాలపట్నం వైపు వెళ్లారని గుర్తించారు. ఆ తరువాత దోపిడీ చేసిన వారు బైకులను పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడేసి ట్రైన్ ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. అయితే పశ్చిమబెంగాల్ లోని బుర్ద్వాన్ తో పాటు మరో చోట టెర్రరిస్టుల డెన్ లలో పేలుడు సంభవించింది. అక్కడకు చేరుకున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఘటనా స్థలాన్ని సందర్శించినప్పుడు చొప్పదండి బ్యాంకుకు సంబంధించిన లేబుళ్లను గుర్తించింది. అప్పుడు
చొప్పదండి బ్యాంకు రాబరీకి పాల్పడింది టెర్రరిస్టులని తెలిసింది. సాంకేతికత ఎంత అందిపుచ్చుకున్నప్పటికీ దొపిడీ ముఠాలు వ్యవహరించే తీరు… ఏప్రాంతానికి చెందిన వారు ఎలా దోపిడీలు చేస్తారు..? సొత్తు ఎత్తుకెళ్లేప్పుడు ఎలా వ్యవహరిస్తారు అన్న వివరాలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న పోలీసులు ఇలాంటి సమయాల్లో అత్యంత కీలకమన్న విషయం గుర్తెరగాలి.