పెయిడ్ పార్కింగులో బైక్ పెట్టి ఎలా తిరిగారు..?
దిశ దశ, పెద్దపల్లి:
సాధారణ మెకానిక్ ల వేషంలో తిరిగిన ఆ ముఠా ఎక్కడెక్కడ సంచరించింది..? తమ వెంట తెచ్చుకున్న బైక్ పెయిడ్ పార్కింగులో ఉంచి ఎలా తిరిగారు..? దాదాపు నెల రోజుల పాటు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థను ఎంచుకుని తిరగడం వెనక దాగి ఉన్న స్కెచ్ ఏమిటీ..? ఇప్పుడివే ప్రశ్నలు కరీంనగర్ పోలీసుల మదిలో మెదులుతున్నాయి. కరీంనగర్ జ్యోతినగర్ లోని PMJ Jewellery షోరూంలో దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ కదలికలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా ఐడీ ప్రూఫ్ లు ఇచ్చిన ముఠా సభ్యులు ఆరుగురు పెద్దపల్లి పట్టణంలోని పరమేశ్వర లాడ్జిలో మూడు సార్లు గది అద్దెకు తీసుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. లాడ్జిలో ఉంటూ కరీంనగర్ PMJ Jewellery షోరూంలో దోపిడీ వేసేందుకు స్కెచ్ వేశారని భావించినప్పటికి వెలుగులోకి వస్తున్న విషయాలు అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తుతున్నాయి. పెద్దపల్లిలోని ఓ పెయిడ్ పార్కింగ్ ప్లేస్ లో ఏప్రిల్ నెలలో 25 రోజుల నుండి 30 రోజుల వరకూ అపాచి బైక్ ను పార్క్ చేసి వివిద ప్రాంతాల్లో తిరిగినట్టుగా తెలుస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో వీరు తిరిగారని పోలీసులు గుర్తించి ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ సేకరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. పెయిడ్ పార్కింగ్ వద్ద డబ్బులు చెల్లించిన ముఠా బైకును ఏప్రిల్ చివరి వారంలో తీసుకెళ్లి, నాలుగైదు రోజుల తరువాత ధర్మపురి లాడ్జిలో గద్ది అద్దెకు తీసుకుంది. అయితే ఈ ముఠా తమ బైకును పార్కింగ్ ప్లేసులో ఉంచి ఏఏ ప్రాంతాల్లో సంచరించింది..? దోపిడీ చేసేందుకు అనువైన ప్రాంతాన్ని ఎంచుకునేందుకు ఆయా ప్రాంతాల్లో సంచరించిందా లేక పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు మార్గాలను వెతికేందకు తిరిగిందా అన్న విషయంపై స్పష్టత రావడం లేదు. మార్చి, ఏప్రిల్ నెలల్లో పెద్దపల్లిలో షెల్టర్ తీసుకుని అసలేం చేశారు అన్న విషయంపై అంచనా వేసే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు.
బైక్ వారిదేనా?
అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ తర్వాత ముఠా వాడిన పల్సర్ బైకును ధర్మపురి పుష్కర ఘాట్ వద్ద వదిలేశారు. దోపిడీ చేసినప్పుడు రెండు బైకులు వినియోగించిన ముఠా మరో బైక్ ను మాత్రం వదిలేయలేదు. ఆపాచి వైట్ కలర్ బైక్ ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. పెద్దపల్లిలో తిరిగినప్పుడు కూడా అపాచీ బైక్ వినియోగించినందున ఆ వెహికిల్ వారి సొంతమై ఉంటుందని భావిస్తున్నారు.
ఆరో వ్యక్తి?
మరో వైపున దోపిడీ ముఠాలో ఐదుగురు కాకుండా మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. పెద్దపల్లిలో ఆరుగురు వ్యక్తులు సంచరించారని స్థానికులు చెప్తున్నారు. ధర్మపురిలో కూడా ఆరుగురు ఉన్నారని స్థానికులు చెప్పినప్పటికీ విజయలక్ష్మి లాడ్జి నిర్వాహకులు మాత్రం ఐదుగురేనని చెప్పారు. ఈ ముఠాలోని ఆరో వ్యక్తి భారీ వాహనాన్ని సిద్ధంగా ఉంచి దోపిడీ చేసి వచ్చిన వారిని సేఫ్ గా తరలించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే పల్సర్ బైక్ ధర్మపురి పుష్కర ఘాట్ సమీపంలో వదిలేసి అపాచి బైక్ వెంట తీసుకెళ్లి ఉంటారని అనుకుంటువ్నారు. అపాచీ బైక్ కూడా చోరీ చేసినట్టయితే పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు వేరే చోట పడేసి వెళ్లిపోయి ఉండే అవకాశాలున్నాయి.

