సాఫ్ట్ వేర్ ఉద్యోగుల హార్డ్ కోర్ దందా… డ్రగ్స్ క్రయవిక్రయాలు…

దిశ దశ, హైదరాబాద్:

సాఫ్ట్ వేర్ ఉద్యోగులు హార్డ కోర్ దందాల్లో భాగస్వాములు అవుతున్నారు. లక్షల్లో ప్యాకేజీ వస్తున్నా అక్రమ మార్గాల ద్వారా ఆదాయం గడించడమే పనిగా పెట్టుకున్నారు కొందరు. మరికొందరు అక్రమంగా కొనుగోలు చేసి మత్తులో జోగుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఎక్సైజ్ ఎస్టీఎప్ బీ టీం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల బాగోతాన్ని బట్టబయలు చేసింది. హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ సమన్ నగర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల డ్రగ్జ్ దందా గుట్టును రట్టు చేసింది ఎస్టీఎఫ్ టీమ్.

డ్రగ్ పెడ్లర్…

డ్రగ్ పెడ్లర్లుగా (Drug Peddler) కొంత మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సరికొత్త దందా స్టార్ట్ చేశారు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ నిపుణులు కొంతమంది డ్రగ్స్ కు బానిసయ్యారన్న ఆందోళన వ్యక్తం అవుతుంటే మరికొంత మంది డ్రగ్ పెడ్లర్ (Drug Peddler)గా కూడా రూపాంతరం చెందుతున్నారు. దీంతో వారి బంగారు భవిష్యత్తును మత్తుకే అంకితం చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బీటీమ్ పట్టుకున్న వారిలో ముగ్గురు కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే కావడం విశేషం.

రూ. 2 వేలకు…

సాఫ్ట్ వేర్ హెడ్ క్వార్టర్స్ గా పేరు గాంచిన కర్ణాటకలోని బెంగుళూరు నుండి రూ. 2 వేలకు గ్రాము చొప్పన MMDA డ్రగ్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో రూ. 8 వేల నుండి 10 వేలకు గ్రాము చొప్పుున విక్రయిస్తున్నారు. ఉద్యోగం పొడగొట్టుకున్న ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి బెంగుళూరు నుండి డ్రగ్స్ తెప్పిస్తుండగా మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగి పెట్టుబడి పెట్టారు. ఈ డ్రగ్ ను మూడో సాప్ట్ వేర్ ఇంజనీర్ కొనుగోలు చేస్తుండగా ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బీ టీమ్ పట్టుకుంది.

అరెస్ట్…

అంజద్,, హేమంత్, హరీష్ అనే ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను డ్రగ్స్ కేసులో ఎస్టీఎఫ్ బీ టీం సీఐ బి బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజులు పట్టుకుని నిందితుల నుండి 7.44 గ్రాములు ఎండిఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరిని హయత్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించామని ఎస్టీఎఫ్ బీ టీం లీడర్ ప్రదీప్ రావు మీడియాకు తెలిపారు.