పొంతన లేని లెక్కలు… లెక్కకు మించి బిల్లులు…
దిశ దశ, కరీంనగర్:
విద్యుత్ కాంతులను వెదజల్లే ఎన్టీపీసీలో బహిరంగంగా సాగుతున్న చీకటి కోణంపై సర్వత్రా చర్చ నీయాంశంగా మారింది. తన ఆధీనంలో ఉన్న బూడిదను ఖాలీ చేయాలన్న ఆతృత సంస్థదయితే… పని పూర్తి చేయాలన్న తపన హైవే అథారిటీ అధికారులది. వీరిద్దరి అవసరమే కాంట్రాక్టర్లకు వరంగా మారిపోయినట్టుగా ఉంది.
తక్కువ ధర…
ఎన్టీపీసీలలో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించిన బొగ్గు ద్వారా విడుదలైన బూడిద ఆ సంస్థకు గుది బండగా మారిపోయింది. దీనిని నిర్మాణాలకు వినియోగిస్తే ఎలా ఉంటుందోనన్న విషయంపై అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఉపయోగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ యాష్ ను మంచిర్యాల నుండి విజయవాడ వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కు సరఫరా చేయాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకోసం రవాణా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి జాతీయ స్థాయిలో పేరెన్నికన్న పలు కంపెనీలకు ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టు ఎన్టీపీసీ అప్పగించింది. అయితే ఆయా సంస్థలు కరీంనగర్ రామగుండం సమీపంలోని కుందన్ పల్లి యాష్ ప్లాంట్ తో పాటు ఎన్టీపీసీలో నిలువ ఉన్న బూడిదను రవాణా చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుండి 250 నుండి 300 కిలో మీటర్ల దూరంలో సాగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తరలిపోతోంది బూడిద. ఇందు కోసం ఎన్టీపీసీ రూ. 3.82 సీబీఎం పర్ క్యూబిక్ మీటర్ కు రవాణా ఛార్జీలు చెల్లిస్తుండగా లోడింగ్ ఛార్జీలతో పాటు, స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు ఒక్కో లారీకి రూ. 500 వరకు వసూలు చేస్తున్నారు.
పరిమితి వరకే...
అయితే రామగుండం నుండి తరలి వెల్తున్న బూడిద ఓవర్ లోడ్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎన్టీపీసీ అధికారులు ఓవర్ లోడ్ పంపించేది లేదని చెప్తున్నారు. దీంతో లారీల సామర్థ్యానికి తగ్గట్టుగానే బూడిద రవాణా చేస్తున్నారు. అయితే రామగుండం నుండి తరలి వెల్తున్న బూడిదకు, గ్రీన్ ఫీల్డ్ హైవే వరకు చేరుకుంటున్న బూడిదకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాంటు నుండి నిబంధనల ప్రకారమే బూడిద తరలి వెల్తున్నప్పటికీ నిర్మాణం వద్దకు చేరే సరికి ఓవర్ లోడ్ రికార్డ్ అవుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం బూడిద ఉపయోగించాలన్న నిబంధనలకు విరుద్దంగా ఇతరాత్ర ముడి సరుకులు కలుపుతూ రవాణా కాంట్రాక్టర్లు ఎన్టీపీసీ ఖజానాకు దర్జాగా తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రవాణా విభాగం రూల్స్ అతిక్రమించడం లేదని చెప్తూనే నిర్మాణం జరుగుతున్న హైవే వద్దకు మాత్రం ఎక్కువ మోతాదులో బూడిద చేర్చినట్టుగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీపీసీ అన్ లోడింగ్ పాయింట్ల వద్ద ఉన్న వే బ్రిడ్జిల వద్ద తూకాన్ని పరిగణనలోకి తీసుకుని బిల్లులు చెల్లుస్తోంది. ఇదే ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లకు వరంగా మారిపోయినట్టుగా స్పష్టం అవుతోంది. వాస్తవంగా లోడింగ్, అన్ లోడింగ్ పాయింట్ల వద్ద ఎన్టీపీసీ కానీ గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు లేకపోవడం వల్లే అక్రమ లెక్కలకు తెర తీసినట్టుగా తెలుస్తోంది. అన్ లోడింగ్ పాయింట్ల వద్ద ఉన్న వే బ్రిడ్జిల వద్ద ఇచ్చిన రిసిప్ట్ ఎన్టీపీసీలో సబ్మిట్ చేసి డబ్బులు డ్రా చేసుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. అయితే రవాణా చేస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఖమ్మం ఉమ్మడి జిల్లా పరిసర ప్రాంతాల్లో లభ్యం అవుతున్న ప్రత్యామ్నాయ వనరులను రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీపీసీ నుండి వాస్తవంగా వెలుతున్న బూడిదకు కాకుండా ప్రత్యామ్నాయంగా సరఫరా చేస్తున్న ముడి సరుకు రవాణా చార్జీలను కూడా కలిపి సంస్థ నుండి రవాణా కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తక్కువ ధర…
ఇకపోతే ఎన్టీపీసీ నుండి బూడిద రవాణా చేస్తున్న కంపెనీలు టెండర్లలో పాల్గొని లెస్ రేట్ కు బిడ్లు వేసి దక్కించుకున్నాయి. ఒక్కో టన్నుకు సంస్థ రూ. 788 చొప్పున కాంట్రాక్టు ఏజెన్సీలకు రవాణా ఛార్జీలు చెల్లిస్తుంటే L2 కాంట్రాక్టర్ కు మాత్రం ఏజెన్సీలు రూ. 1150 వరకు చెల్లిస్తున్నాయని తెలుస్తోంది. L2 కాంట్రాక్టర్ థర్డ్ పార్టీకి ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీకి రూ. వెయ్యి చొప్పున ఇస్తున్నట్టుగా సమాచారం. ఎన్టీపీసీ ఇస్తున్న ధర రూ. 788 అయితే ప్రధాన ఏజెన్సీలు, L2 కాంట్రాక్టర్లు చెల్లిస్తున్న ధరకు వ్యత్యాసం ఎక్కువగా ఉండడం గమనార్హం. ఎన్టీపీసీ ఇచ్చిన బిడ్ రేట్లకు తక్కువగా వేసిన ఏజెన్సీలు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థలకు రవాణా ఛార్జీలు ఎక్కువగా ఇస్తుండడం వెనక ఉన్న అసలు కారణమేంటన్నది తేలాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై సమగ్రంగా ఆరా తీస్తే అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. ఈ లెక్కన ఎన్టీపీసీ నుండి తక్కువ మోతాదులో బూడిద రవాణా అవుతున్నా… ఎక్కువ అయినట్టుగా రవాణా ఛార్జీలు డ్రా చేసుకుంటున్న ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీల వల్ల సంస్థకు రూ. కోట్లలో ఆర్థిక భారం పడుతోందని స్పష్టం అవుతోంది. అంతేకాకుండా ఎన్టీపీసీలో ఉన్న బూడిద నిలువ మాత్రం సగానికి సగం అక్కడే ఉండిపోనుంది. దీంతో ఎన్టీపీసీ రెండు విధాలుగా నష్టపోతోందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
బూడిద రవాణాపై సాగుతున్న వ్యవహారంపై త్వరలో మరిన్ని కథనాలు… రానున్నాయ్…

