అశోక్ పేరిట విడుదలైన లేఖ…
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ఉనికి..?
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతర్థానం అయిపోయిందని భావించిన నేపథ్యంలో లేఖలు, బ్యానర్లు ప్రత్యక్ష్యం కావడం సంచలనంగా మారింది. దండకారణ్య జోన్ లో మావోయిస్టు పార్టీ నాయకుడు అశోక్ పేరిట విడుదలైన లేఖ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలుకా జువేలి, పిప్లి, బుర్గితో పాటు పలు గ్రామాల్లో కనిపించిన కరపత్రాలను భద్రతా బలగాలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. జిల్లాలో ఇనుప ఖనిజాలను తీసుకెళ్లేందుకు కంపెనీలు రంగంలోకి దిగాయని వాటికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాలని అశోక్ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే కొనసాగుతున్న మైనింగ్, కొత్తగా ప్రారంభించనున్న ప్రాజెక్టులను నిలిపివేయాలని అశోక్ డిమాండ్ చేశారు. సర్పంచులు, ప్రజలు కంపెనీల చర్యలను వ్యతిరేకించాలని కరపత్రం ద్వారా పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరిట వెలిసిన లేఖల నేపథ్యంలో గడ్చిరోలి-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో బలగాలచే కూంబింగ్ ముమ్మరం చేసినట్టు సమాచారం. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులకు అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది.
నకిలీలా..?
దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకత్వం అంతా కూడా జనజీవనంలో కలిసిపోయింది. గడ్చిరోలి-ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో సాయుధ పోరు చేసిన నాయకులంతా కూడా సాయుధులుగా జనజీవనంలో కలిశారు. మావోయిస్టు పార్టీ ఉనికే లేకుండా పోయిందని ధీమా వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో తాజాగా ప్రత్యక్ష్యం అయిన లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. సాయుధ పోరు చేసే క్యాడర్ కూడా లేని ఈ సమయంలో లేఖలు విడుదల చేయడం వెనక మావోయిస్టు పార్టీకి చెందిన వారే ఉన్నారా నకిలీలు పుట్టుకొచ్చారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. దీంతో గడ్చిరోలి జిల్లా పోలీసు యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టింది.


