స్టాక్ యార్డ్ లో ఇసుక డంప్… మానేరు నదిలో లోడింగ్…

కొండపాక ఇసుక రీచుల్లో ఇష్టారాజ్యం…

దిశ దశ, కరీంనగర్:

ఇసుక రీచుల నిర్వాహకులు సరికొత్త తరహా అక్రమాలకు తెరలేపుతున్నారా..? నిబంధనలు గాలికొదిలి లోడింగ్ చేస్తున్నారా..? దర్జాగా సాగుతున్నా నియంత్రించే వారు ఉండరా..? వీణవంక మండలం కొండపాక ఇసుక రీచుల్లో అసలేం జరుగుతోంది..?

నదిలోనే…

సాధారణగా TGMDC ఏర్పాటు చేసే ఇసుక రీచుల్లో స్టాక్ యార్డుల వద్ద మాత్రమే లోడింగ్ ప్రక్రియ కొనసాగించాల్సి ఉంటుంది. TGMDC అధికారులు సూచించిన ప్రాంతం నుండి ఇసుకను స్టాక్ యార్డులకు తరలించి అక్కడి నుండి లారీల్లో లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొండపాక ఇసుక రీచుల్లో మాత్రం నిబంధనలు గాలికొదిలి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతోంది. TGMDC అధికారులు ప్రత్యక్ష్యంగా పర్యవేక్షిస్తున్నా నిబంధనలు అమలు కాకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్నదే మిస్టరీగా మారింది. ప్రాజెక్టు ఆఫీసర్ తో పాటు TGMDC ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా రీచుల్లో విధులు నిర్వర్తిస్తున్నా కూడా బాజాప్తాగా సాగుతున్న లోడింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండపాక మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో ఓ వైపున నీటి ప్రవాహం కొనసాగుతుండగా మరో వైపున లారీల్లో ఇసుక లోడింగ్ కొనసాగిస్తున్నారు. నదిలోకి భారీ వాహనాలను అనుమతించకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ కొండపాక రీచుల్లో మాత్రం ఇష్టారీతిన లోడింగ్ ప్రక్రియ కొనసాగుతుండడం విమర్శలకు దారి తీస్తోంది.

లారీల క్యూ…

రీచుకు సంబంధించిన స్టాక్ యార్డ్ వద్ద క్యూ కట్టాల్సిన లారీలు ఏకంగా మానేరు నదిలోనే వరస క్రమంలో నిలుస్తున్నాయి. మిషనరీ ద్వారా లారీల్లో ఇసుక లోడింగ్ చేస్తున్న నిర్వాహకులు తమను అడ్డుకునే వారెవరూ లేరన్న ధీమాతో నడుచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ట్రాన్సిట్ పాస్ లు ఇచ్చేందుకు నియమించిన ఉద్యోగులు కానీ ఇతరాత్ర డ్యూటీల్లో ఉన్న సిబ్బంది కానీ, ప్రాజెక్ట్ ఆపీసర్ కానీ మానేరు నదిలోకి లారీల్లో ఇసుక లోడింగ్ అవుతున్నా తమకేమీ పట్టనట్టుగా నడుచుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది.

రెండు రీచుల్లో…

కొండపాకలో TGMDC ఏర్పాటు చేసిన రెండు రీచుల్లో కూడా లోడింగ్ ప్రక్రియ నదిలోనే కొనసాగుతుండడం విచిత్రం. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న ఈ తీరు గురించి స్థానికులు ప్రశ్నిస్తే తమ వెనక బడా బాబులు ఉన్నారంటూ అక్కడ పని చేస్తున్న సిబ్బంది పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఇసుక రీచులను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన TGMDC ఉన్నతాధికారులు కూడా నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న తీరుపై దృష్టి సారించకపోవడానికి కారణమేంటన్న చర్చ సాగుతోంది.