సీలింగ్ భూములకు ఎసరు పెట్టిన ఘనులు…

స్వాధీనం చేసుకున్న సర్కారు…

జగిత్యాల జిల్లాలో సంచలనం

దిశ దశ, జగిత్యాల:

రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లోపాలే వారికి వరంగా మారాయి. లోతు పాతులు తెలుసుకోకుండా చకాచకా క్రయ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అధికారులు. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు సీలింగ్ పరిధిలో ఉన్న భూములు తమవేనని అక్రమంగా అమ్మేసుకున్నారు. బాధితులు, సర్పంచ్ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ భూములు సీలింగ్ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నవని తేల్చి వాటి లావాదేవీలను రద్దు చేశారు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

అసలేం జరిగిందంటే…

జిల్లాలోని కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామంలోని సర్వే నంబర్ 545లో 11.26 ఎకరాలు, సర్వే నంబర్ 551లో 11 ఎకరాల భూమిని 1973 సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే పునుగోటి లక్ష్మణ్ రావుకు చెందిన ఈ భూములను మిగులుగా గుర్తించినట్టుగా ప్రకటించారు. వీటిని లబ్దిదారులకు కూడా అలాట్ చేసినప్పటికీ అక్రమంగా మ్యూటేషన్లు చేసి విక్రయ దస్తావేజులు కూడా తయారు చేసుకున్నారు. 1987లో మిగులు భూములు ప్రభుత్వానికి అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు భూ సంస్కరణల ట్రిబ్యూనల్ కూడా ఆమోదం తెలిపింది. 1989లో ట్రిబ్యూనల్ తుది ఆమోదాన్ని కూడా ప్రకటించింది. 1992లో పునుగోటి నారాయణరావు చేసిన అప్పీల్ కొట్టివేయబడింది. 1996లో హై కోర్టు సీఆర్పీ దాఖలు చేయగా అక్కడ కూడా పిటిషన్ కొట్టివేయబడింది. 1992లో పంచనామా ద్వారా ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూములను 12 మంది ఎస్సీలకు, ఒక ఓసీకి కెటాయించారు.

అక్రమ మ్యూటేషన్లు…

ఓ వైపున ట్రిబ్యూనల్, మరో వైపున హైకోర్టు పట్టేదార్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ 2018లో పునుగోటి కృష్ణారావు, గోలి అనిత పేర్లు నమోదయ్యాయి. 2019-20లో సర్వే నంబర్ 551లో పునుగోటి కృష్ణారావు పేరు నుండి విక్రయ నామా ద్వారా పునుగోటి హరీష్, పునుగోటి నరేష్ కు, 2025లో బొడ్ల సతీష్ కు, బొడ్ల ఉమాదేవిలకు విక్రయ పత్రం ద్వారా లావాదేవీలు జరిపారు. అయితే మ్యూటేషన్ కానీ, రిజిస్ట్రేషన్ ల్ ద్వారా జరిగిన ఈ భూములపై చట్టబద్దమైన హక్కులు లేవని తేల్చారు అధికారులు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూములు రెవెన్యూ రికార్డుల్లో పునుగోటి లక్ష్మణ్ రావు పేరు కొనసాగడాన్ని పట్టాదారులు అనుకూలంగా మల్చుకున్నట్టుగా స్పష్టం అవుతోంది.

చెల్లవు…

2020, 2025 సంవత్సరాల్లో జరిగిన లావాదేవీలు ఏవీ కూడా చెల్లవని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ప్రొసిడింగ్ నంబర్ E1/876/2026 జారీ చేశారు. పునుగోటి కృష్ణారావు, గోలి అనిత, పునుగోటి హరీష్, పునుగోటి నరేష్, బొడ్ల సతీష్, బొడ్ల ఉమాదేవిలకు సంబంధించిన మ్యూటేషన్లి కూడా అక్రమమని విచారణలో తేలిందని కలెక్టర్ స్పష్టం చేశారు. పునుగోటి హరీష్ పేరిట ఉన్న సర్వే నంబర్ 545A/2లోని 3.33 ఎకరాలు, పునుగోటి నరేష్ పేరిట సర్వే నంబర్ 545A/1లోని 3.33 ఎకరాలు, గోలి అనిత పేరిట ఉన్న 545Bలో ఉన్న ఒక ఎకరం, బొడ్ల సతీష్ పేరిట 551/2లో ఉన్న 5.20 ఎకరాలు, బొడ్ల ఉమాదేవి పేరిట ఉన్న సర్వే నంబర్ 551/1లో 5.20 ఎకరాలులకు సంబంధించిన లావాదేవీలు ఏవీ కూడా చెల్లవని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. సర్వే నంబర్ 545లోని 11.26 ఎకరాలు, సర్వే నంబర్ 551లోని 11 ఎకరాల భూమిని ప్రభుత్వ ఖారజ్ ఖాతాలో ఉన్నట్టుగా రెవెన్యూ రికార్డుల్లో మార్చాలని, భూ భారతి పోర్టల్ లో ప్రభుత్వ హక్కును పునరుద్దరించాలని నిర్ణయించినట్టుగా వెల్లడించారు.

బాధితుల ఆందోళన…

ఈ భూముల విషయంలో ఇటీవల బాధితులు, సర్పంచ్ గంగారావులు జిల్లా అధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని స్పష్టం చేశారు. అయితే తమకు ప్రభుత్వం అలాట్ మెంట్ చేసిన పేపర్లను కూడా తీసుకున్నారని బాధితులు ఆరోపించారు.