రక్షణ వలయంలో ‘‘మలోఝ్జుల’’

దిశ దశ, పెద్దపల్లి:

నిన్న మొన్నటి వరకు ఆయన కోసం గాలించిన పోలీసులే ఆయనకు రక్షణ వలయంగా ఉంటున్నారు. ఆయన ఆచూకి కోసం అడవుల్లో వెతకాలని ఆదేశించిన సర్కారే ఆయనకు బాసటగా నిలుస్తోంది. వైవిద్యంగా సాగుతున్న ఆయన గురించే చర్చనీయాంశంగా మారింది.

మలోఝ్జుుల…

దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో కొనసాగిన మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన మల్లోఝ్జుల వేణులోపాల్ రావు రక్షణ వలయం కొనసాగుతోంది. పెద్దపల్లి పట్టణంలోని శివాలయం వీధికి చెందిన వేణులోపాల్ రావు మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా, కేంద్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు. ఎంతో మందిని విప్లవం వైపు నడిపించిన ఆయన జనజీవనంలో కలిశారు. గత సంవత్సరం అక్టోబర్ 25న గడ్చిరోలి జిల్లా కేంద్రంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సుదీర్ఘ కాలం విప్లవ పోరాటంలో కొనసాగిన ఆయన పేరు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉండేది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఆయన జనజీవనంలో కలిసిన తరువాత వైవిద్యమైన జీవనాన్ని సాగిస్తున్నారు.

రక్షణ వలయం…

పార్టీని వీడిన తరువాత మలోఝ్జుల వేణుగోపాల్ రావు మహారాష్ట్రలోని గడ్చిరోలిలోనే ఉంటున్నారు. అక్కడి పోలీసుల భద్రత నడుమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఆయన స్వస్థలం అయిన పెద్దపల్లికి వచ్చినా కూడా ఆయనకు మహారాష్ట్ర పోలీసులు రక్షణగా నిలుస్తున్నారు. తాజాగా శనివారం పెద్దపల్లికి చేరుకున్న ఆయన మహారాష్ట్ర పోలీసుల భద్రతలోనే ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుటుంబ సభ్యులను చూసేందుకు వచ్చిన వేణుగోపాల్ రావు వెంట గడ్చిరోలికి చెందిన పోలీసు అధికారులు ఉండడం గమనార్హం. ప్రత్యేక వాహనంలో పెద్దపల్లికి చేరుకున్న వేణుగోపాల్ రావు దరికి మీడియాను కూడా రానివ్వకుండా నిలువరిస్తున్నారు. మల్లోఝ్ఝుల ఫ్యామిలీ మెంబర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం ప్రదర్శిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. నిన్న మొన్నటి వరకు అణగారిన వర్గాల కోసం పోరుబాట పట్టిన ఆయన వద్దకు సామాన్యులు కూడా వెళ్లనీయకుండా వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఆయుధాలతో సహా బయటకు వచ్చిన వేణుగోపాలర్ టార్గెట్ అయ్యారన్న కారణంతోనే ఈ స్థాయిలో భద్రత వలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక్కడ ఇలా…

మహారాష్ట్రలో జనజీవనంలోకి వచ్చిన వేణుగోపాల్ రావుకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయగా తెలంగాణా పోలీసుల ముందు లొంగిపోయిన అగ్రనేతలు మాత్రం సాదాసీదా జీవనం సాగిస్తుండడం గమనార్హం. కేంద్ర కమిటీ సభ్యుుగా పని చేసిన దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి, తెలంగాణ కార్యదర్శిగా పని చేసిన బడే దామోదర్ వంటి నేతలంతా కూడా సాధారణ జీవనం గడుపుతున్నారు. వీరికి ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేసిన దాఖలాలు అయితే లేవు. వారిని కలిసేందుకు వెళ్లిన ప్రతి ఒక్కరిని కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. చర్చలు కూడా జరుపుతున్నారు. ఒకరిద్దరు రక్షణ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం వాహనం సమకూర్చాలన్న ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టు సమాచారం.

పార్టీ లేదు కదా…

అయితే ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి చెందిన చాలా మంది అగ్రనేతలు అరణ్యం వీడి జనారణ్యంలోకి వచ్చారు. దీంతో అగ్రనేత ముప్పాళ లక్ష్మణ్ రావుతో పాటు ఒకరిద్దరు మాత్రమే అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. మిగతా వారంతా కూడా బయటకు వచ్చేశారు. దీంతో మావోయిస్టు పార్టీ సమూలంగా అంతరించి పోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోకసభలోనే ప్రకటించారు. అసలు పార్టీ ఉనికే లేకుండా పోయినప్పుడు మాజీ నేతలను టార్గెట్ చేసేది ఎవరు..? మావోయిస్టు సాయుధ దళాల సంచారమే లేనప్పుడు వీరిపై దాడికి యత్నించేది ఎవరూ అన్న ప్రశ్నలకు జవాబు మాత్రం లేకుండా పోతోంది. ఏది ఏమైనా ఒకప్పుడు వేణుగోపాల్ రావు ఏరివేత కోసం ప్రయత్నించిన పోలీసులే నేడు ఆయనకే భద్రత కల్పించాల్సి రావడం సరికొత్త చర్చకు దారి తీస్తోంది.