స్త్రీ, శిశు సంక్షేమానికి అవినీతి చెద…

సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్…

దిశ దశ, కరీంనగర్:

లంచం నేరుగా తీసుకోనట్టయితే ఏసీబీ అధికారులకు చిక్కే అవకాశం లేదన్న ధీమాతో ఓ ఉద్యోగిని అవినీతికి పాల్పడడం మొదలెట్టారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు సరఫరా చేసే కాంట్రాక్టర్ల నుండి వసూలు చేసే కమిషన్ డబ్బులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి బదిలీ చేయించుకున్నారు. సదరు ఉద్యోగినిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేసిన కరీంనగర్ రేంజ్ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ ICDS సంక్షేమ శాఖ కర్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దునక రాధికను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కాంట్రాక్టర్ల బిల్లులను వేగంగా క్లియర్ చేసేందుకు అక్రంగా కమిషన్లు వసూలు చేస్తున్నారని రాధికపై ఆరోపణలు వచ్చాయి. బిల్లులు త్వరితగతిన పూర్తి చేయాలని ఔట్ సోర్పింగ్ సిబ్బందిని ఒత్తిళ్లకు గురి చేశారని ఏసీబీ విచారణలో తేలింది. అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు, పప్పులు తదితరాలను సరఫరా చేసే కాంట్రాక్టర్ల నుండి లంచం డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ రాధిక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, తన కుటుంబ సభ్యుల అకౌంట్లకు UPI లావాదేవీల ద్వారా లంచం డబ్బులు బదిల చేయించుకున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. 2022 జూన్ నుండి 2024 ఏప్రిల్ వరకు రూ. 2,37,500లు లంచం తీసుకున్నట్టుగా తేల్చారు. దీంతో రాధికను అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.