దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జ్యువెల్లరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠా ములాలను సైతం పెకిలించివేసే పనిలో నిమగ్నం అయ్యారు పోలీసులు. దోపిడీలో పాల్గొన్నది, స్కెచ్ వేసింది… ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా అయినా కూడా వెంటాడి వేటాడి మరీ పట్టుకుంటున్నారు. దోపిడీ ముఠా దొరకడమే కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తం అయిన పరిస్థితుల్లో రాబరీ గ్యాంగ్ కు సంబంధించిన నెట్ వర్క్ ను ఛేదిస్తున్న తీరు ఆదర్శంగా నిలుస్తోంది. ఒక్కొక్కరిని పట్టుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న కరీంనగర్ పోలీసులు మరో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. Cr.No.245/2026లో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా తాజాగా మరో నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. బిహార్ రాష్ట్రంలోని పాట్నా ప్రాంతంలో యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్ (33)ను అదుపులోకి తీసుకున్నారు. పాట్నా పోలీసుల సహకారంతో యాదవ్ ను పట్టుకుని నేర కార్యకలాపాలకు ఉపయోగించిన POCO C75 5G మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆయుధాలు… రవాణా…
సుబోధ్ గ్యాంగ్ లో కీలకంగా వ్యవహరిస్తున్న యాదవ్ దోపిడీ ముఠాలకు అన్ని రకాలుగా సాయం అందించేవాడని పోలీసుల విచారణలో తేలింది. వాహనాల తరలింపు, క్రెటా కారులో ప్రయాణ ఏర్పాట్లు, ఆయుధాలతో పాటు నేరానికి అవసరమైన సామాగ్రిని అందించే వ్యవహారాలు చక్కబెట్టేవాడని తేలింది. సుబోధ్ కనుసన్నల్లో ఏర్పాటు చేసే రాబరీ గ్యాంగ్స్ కు అవసరమైన అన్ని రకాల వనరులను సమకూర్చడంలో కీలక పాత్ర పోషించిన యాదవ్ పోలీసులకు చిక్కడంతో ఈ కేసులో మరిన్ని కీలక సాక్ష్యాలు లభించినట్టయింది. ఈ కేసులో మొత్తం 13 మంది పాత్ర ఉన్నట్టుగా తేల్చి కేసు నమోదు చేయగా ఇందులో ఆరుగురిని అరెస్ట్ చేసి సంచలనం సృష్టించారు.
బృందాలు అక్కడే…
పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందిన దోపిడీ ముఠానే కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ నుండి నగలు ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించి ఈ రెండు రాష్ట్రాలలోనే సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కరీంనగర్ కు సంబంధించిన టీమ్స్ ఆయా రాష్ట్రాలలో రాబరీ గ్యాంగ్ కోసం తీవ్రంగా శోధిస్తున్నాయి. తమకు సంబంధం లేని రాష్ట్రాలలో సంచిరస్తూ సుబోధ్ గ్యాంగ్ కు సంబంధించిన ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. దోపిడీలో ప్రత్యక్ష్యంగా పాల్గొన్న వారిలో అదృశ్యం అయిన వారి కోసం మరిన్ని పోలీసు టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. వారి గురించి సమగ్ర డాటా సేకరించిన అదుపులోకి తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు.
సుబోధ్ ఫిక్స్..?
అయితే ఇప్పటి వరకూ తనకు ఏమీ తెలియదని కరీంనగర్ పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్న కింగ్ పిన్ సుబోధ్ కుమార్ సింగ్ అలియాస్ బాబువా ఈ కేసులో పక్కాగా ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తోంది. రాబరీ తరువాత కరీంనగర్ పోలీసులు కేసు పూర్వాపరాలపై దృష్టి సారించి ఇందులో ఎంతమంది పాత్ర ఉంది..? వారు ఎవరూ అన్న వివరాలను సేకరించడంలో సక్సెస్ అయ్యారు. దీంతో అరెస్ట్ చేస్తున్న ఒక్కో నిందితుని కన్ఫెషన్ ఆదారంగా సుబోధ్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. రాబరీ చేసిన వారికి తుపాకులు, వాహనాలు సమకూర్చడంతో పాటు ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చిన వారు, సిమ్ కార్డులు సరఫరా చేసిన వారు ఇలా ప్రతి ఒక్కరిని గుర్తిస్తూ పట్టుకుంటున్నారు. వీరందరికి కింగ్ పిన్ సుబోధ్ సింగేనని బిహార్ జైలు నుండే దోపిడీ ముఠాలను మానిటరింగ్ చేస్తున్నాడని కీలక సూత్రధారి అతనేనని రుజువు చేసే ఆధారాలను కూడా కొన్నింటిని ఇప్పటికే సేకరించారు కరీంనగర్ పోలీసులు. మిగతా వారిని అరెస్ట్ చేసిన తరువాతా సుబోధ్ సింగ్ భాగస్వామ్యాన్ని నిరూపించేందుకు అవసరమైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇంతకాలం తనకేమీ కాదన్న ధీమాతో వ్యవహరించిన గోల్డ్ థీప్ కథ కరీంనగర్ రాబరీతో కటకటాలకు చేర్చనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

