నగరానికి ఎలా వచ్చారు..? భగత్ నగర్ రాబరీ గ్యాంగ్ కదలికలపై ఆరా…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ భగత్ నగర్ లో దోపిడీకి పాల్పడిన ముఠా గురించి క్షేత్ర స్థాయిలో ఇంకా దర్యాప్తు జరుగుతోంది. రాబరీ గ్యాంగ్ కరీంనగర్ కు ఎలా వచ్చారన్న విషయంపై స్పష్టత రాకపోవడంతో పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. దోపిడీ జరిగిన రోజు రాత్రి 10 గంటల తరువాత భగత్ నగర్ లో సంచరించినట్టుగా ప్రాథమికంగా నిర్దారించారు. ఓ స్కూల్ సీసీ ఫుటేజీలో అనుమానితుల కదలికలు దొరకడంతో వారి కదలికల గురించి తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యారు పోలీసులు. అయితే దోపిడీ చేసిన ఇంటీ సమీపం వరకు గ్యాంగ్ ఆటోలో వచ్చినట్టుగా అనుమానిస్తున్న పోలీసులు వీరు నగరానికి ఎలా చేరుకున్నారన్న విషయంపై తెలుసుకుంటున్నారు. ప్రైవేట్ వాహనంలో కరీంనగర్ కు వచ్చారా లేక ఆర్టీసీ బస్సులో కరీంనగర్ బస్ స్టేషన్ లో దిగి ఆటోలో వచ్చారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రానట్టుగా తెలుస్తోంది. అలాగే ముఠా ఘటనకు పాల్పడిన రోజునే కరీంనగర్ చేరుకున్నారా అంతకుముందే వచ్చి ఎక్కడైనా షెల్టర్ తీసుకున్నారా అన్న విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రధానంగా భగత్ నగరలోని పలు సీసీ కెమెరాలు పని చేయకపోవడం వల్ల ముఠా సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు దొరకడం లేదని తెలుస్తోంది. దోపిడీ చేసిన తరువాత ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి రెండు బైకులను కూడా ఎత్తుకెళ్లిన అగంతకులు హుజురాబాద్ సమీపంలోని పెద్దపాపయ్య పల్లి వద్ద చెట్ల పొదల్లో పడేసి పరార్ అయ్యారు. అయితే అర్థరాత్రి హుజురాబాద్ మీదుగా బైకులు వెళ్లిపోయిన తరువాత ఓ కారు కూడా అటువైపుగా వెళ్లడంతో అందులో తప్పించుకుని ఉంటారా అన్న కోణంలో కూడా ఆరాతీస్తున్నారు. ప్రధానంగా ఈ మఠా కరీంనగర్ కు ఎలా వచ్చింది అన్న విషయంపై క్లారిటీ వచ్చినట్టయితే దోపిడీపై స్ఫష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

కాల్ డాటా…

మరో వైపున అనుమానిత నంబర్ల గురించి కూడా తెలుసుకుంటున్నారు పోలీసులు. ఇందు కోసం ఆయా మొబైల్ నంబర్లకు సంబంధించిన టవర్ లోకేషన్స్, కాల్ డాటా సేకరిస్తున్నట్టుగా సమాచారం. ఈ వివారలను ఆధారం చేసుకుని ఎనాలిసిస్ చేసినట్టయితే దోపిడీ ముఠాకు సంబంధించిన ఆధారాలు దొరకడం సులువు అవుతుందని అనుకుంటున్నారు. బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ కు కూడా కరీంనగర్ పోలీసు బృందం చేరుకుంది. వారి అల్లునిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించినట్టయితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. కుటుంబ సభ్యుల అనుమానానికి తోడు దోపిడీ చేసేందుకు వచ్చిన ముఠా కూడా సదరు ఇంట్లో నగదు, నగలు ఎక్కడ ఉన్నాయో నేరుగా అక్కడకే వెళ్లడంతో రాబరీ వెనక అల్లుని హస్తం ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.