దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే అతను చనిపోయేముందు ‘సర్’ ఫారంపై రాసిన లేఖ సంచలనంగా మారింది. తన చావుకు పీఎం నరేంద్ర మోదీనే కారణమని రాసి ఉరి వేసుకుని చనిపోయాడు. రాచర్ల గొల్లపల్లికి చెందిన పిట్ల వంశీ నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి బుధవారం తిరిగి వచ్చాడు. భోజనం చేయమని కుటుంబ సభ్యులు కోరగా తరువాత తింటానని చెప్పి అర్థరాత్రి ఉరి వేసుకుని చనిపోయాడని గ్రామస్థులు చెప్తున్నారు. అయితే తన చావుకు ఇతరులు ఎవరూ కారణం కాదని, వారిని ఇబ్బంది పెట్టవద్దని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తన అంత్యక్రియలు ఆనవాయితీగా జరిపించాలని కూడా కోరాడు. ఇట్లు భారతీయుడు, THANK U GOVT అని రాశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు ప్రధాని మోదీ ఎందుకు కారణమో మాత్రం ఆ లేఖలో వివరించలేదు.

