సొంత పార్టీ నేతల వేధింపులేనా…
ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ నాయకుడు…
పట్టించుకోని అధికార పార్టీ నేతలు…
దిశ దశ, కరీంనగర్:
సొంత పార్టీ అధికారంలో లేకున్నా ఎదురొడ్డి పోరాడాడు. అధికారంలోకి వచ్చిన తరువాత గుర్తింపు లభిస్తుందనుకున్న ఆ నాయకుడు విగతజీవిగా మిగిలిపోయాడు. మూడు రంగుల జెండాను ముద్దాడిన ఆ అధికార పార్టీ నాయకుడు ఆత్మహత్య చేసుకుని మరణించిన తీరు స్థానికంగా విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఈ నెల 14న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బేతెల్లి రాజేందర్ రెడ్డి మృత్యువుతో పోరాడి మరణించాడు. కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేందర్ రెడ్డి బుధవారం అర్థరాత్రి తనువు చాలించాడు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ సమత భర్త అయిన రాజేందర్ రెడ్డి మానకొండూరు ఎమ్మెల్యే పీఏ దాడి చేయించాడని, అట్రాసిటీ కేసు పెట్టించాడని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన గోడు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే వద్దకు వెళ్లినా ఆయన అందుబాటులో లేడని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బేతెల్లి రాజేందర్ రెడ్డి మరణ వాంగ్మూలంలో ఎమ్మెల్యే పీఏ అక్రమ కేసులు నమోదు చేయించి బెదిరించడంతో తాను బలవన్మరణానికి యత్నించానని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చాడు. తన భర్త మృతికి మానకొండూరు ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి కారణమని సమత సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అండదండలతోనే పీఏ అరాచకాలు సృష్టిస్తున్నాడని, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం…
బేతెల్లి రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన తరువాత సొంత పార్టీ నాయకులు కూడా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలో అసలే జరుగుతోంది అన్న విషయంపై అధిష్టానం కూడా దృష్టి సారించకపోవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తరువాత అయినా పార్టీ అండగా నిలబడకపోవడం వెనక కారణమేంటని అడుగుతున్నారు.

బాధ్యులెవరూ..?
అధికారంలో లేనప్పుడు అన్నింటా ముందుండి పనిచేసిన రాజేందర్ రెడ్డి పట్ల చూపించిన వివక్ష సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనపై జరుగుతున్న కుట్రల గురించి పార్టీ పెద్దలకు తెలిసినప్పుడే చొరవ తీసుకుంటే ఇంతదూరం వచ్చేది కాదని అంటున్న వారూ లేకపోలేదు.
హై అలెర్ట్…
కాంగ్రెస్ పార్టీ నాయకుడు బేతెల్లి రాజేందర్ రెడ్డి మరణించడంతో మానకొండూరులో పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అయిన ప్రజాభవన్ వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. గుండ్లపల్లిలో మురళీధర్ రెడ్డి ఇంటి వద్ద కూడా గస్తీ నిర్వహిస్తున్నారు పోలీసులు.

