దిశ దశ, జగిత్యాల:
కరీంనగర్ పీఎంజే జ్యూవెల్లరీస్ షోరూంలో దోపిిడీకి పాల్పడిన ముఠా జగిత్యాల జిల్లా ధర్మపురిలో షెల్టర్ తీసుకుంది. ఈ నెల 1 నుండి 3వ తేది ఉధయం 7 గంటల వరకు విజయ లక్ష్మీ లాడ్జీలో ఉన్నారు. ఆ తరువాత రెండు బైకులపై కరీంనగర్ చేరుకుని దోపీడీకి పాల్పడినట్టుగా స్ఫష్టం అవుతోంది.
రెండు రోజులూ…
ధర్మపురిలోని విజయలక్ష్మీ లాడ్జీలో మొత్తం ఐదుగురు వ్యక్తులు గది అద్దెకు తీసుకుని ఉన్నట్టుగా తెలుస్తోంది. విందు కూడా చేసుకున్న ముఠా సభ్యులు ఏసీ గది చాలడం లేదని మరో రూం కూడా కావాలని అడగగా ఖాలీ రూములు లేవని నిర్వాహకులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే రెండు రోజుల పాటు వీరు ధర్మపురి లాడ్జికే పరిమితం అయ్యారా లేక బయటకు వచ్చారా అన్న విషయంపై తెలియరావడం లేదు. ఒకవేళ బయటకు వచ్చినట్టయితే కరీంనగర్ కు వచ్చి రెక్కీ చేసుకునే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. లేనట్టయితే అంతకుముందే పీఎంజే జ్యూవెల్లరీ షోరూంలో దోపిడీకి స్కెచ్ వేసుకుని తాము సేఫ్ గా వెళ్లి వచ్చే రూట్లను ఎంచుకునే అవకాశం ఉంటుందన్న అనుమానం వ్యక్తం అవుతోంది. దోపిడీ ముఠా లాడ్జిలో ఐడీ ప్రూప్స్ ఇచ్చిందా లేదా అన్న వివరాలతో పాటు వారి కదలికలకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దాదాపు రెండు గంటలుగా లాడ్జీలో పనిచేస్తున్న వారిని, నిర్వాహాకులను ప్రశ్నిస్తున్నారు.
షెల్టర్ అక్కడే…
దోపిడీ ముఠా షెల్టర్ తీసుకున్న ధర్మపురి నుండే తప్పించుకుని పోయినట్టుగా ఇఫ్పటి వరకు లభ్యమైన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వీరు సమీప ప్రాంతాల్లోనే సేఫ్ గా వెల్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని ఉంటారా లేక అన్న విషయం తేలాల్సి ఉంది. దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మపురిని షెల్టర్ గా ఎంచుకోవడం వెనక ఉన్న అసలు కారణమేంటన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మంగళవారం రోజునే ధర్మపురిలో ముఠా వినియోగించిన బైక్ దొరకడం వారు ఖచ్చితంగా ఇదే ప్రాంతం మీదుగా మహారాష్ట్రకు వెళ్లి ఉంటారని పోలీసులు గుర్తించారు. అయితే దోపిడీ ముఠాకు గదులు అద్దెకు ఇచ్చిన లాడ్జి యజమాని వారి ఐడీ ప్రూఫ్ లు తీసుకోలేదని పోలీసుల దృష్టికి వచ్చింది.
తెలుగు మాట్లాడే వ్యక్తి..?
నగల దోపిడీకి పాల్పడిన వారిలో స్పష్టంగా తెలుగులో మాట్లాడింది ఎవరన్న విషయంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అతను స్థానికుడై ఉంటాడని, అతను ముఠాతో చేతులు కలిపి రహదారులు చూపించి ఉంటాడని అనుమానిస్తున్నారు. తెలుగులో మాట్లాడిన వ్యక్తి ఆచూకి దొరికినట్టయితే దోపిడీ స్కెచ్ గురించి సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.