దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన కేసులో నిందితునిగా ఉన్న సుబోధ్ సింగ్ అలియాస్ బాబువా జీవితంలోకి తొంగి చూస్తే అత్యంత విచిత్రమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాకు చెందిన సుబోధ్ సింగ్ ను కరీంనగర్ పోలీసులు దోపిడీ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చిన సంగతి తెలిసిందే. అయితే ఆరు కోర్టులలో పిటి వారెంట్ వేసి అనుమతులు తీసుకుని కరీంనగర్ కు తరలించిన సుబోధ్ సింగ్ గురించి ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. ఆయన మొదట దేశ రక్షణకు సంబంధించిన విభాగాల్లో సేవ చేయాలని భావించినట్టుగా తెలుస్తోంది. మిలటరీ, పారా మిలటరీకి సంబంధించిన ఓ విభాగంలో అర్హత సాధించిన సుబోధ్ సింగ్ జాయిన్ అయ్యేందుకు ట్రైన్ లో వెలుతుండగా సంబంధం లేని కేసులో ఇరుక్కున్నట్టుగా తెలుస్తోంది. అతనిపై కేసు నమోదు కావడంతో విధుల్లో చేరలేకపోయినట్టుగా సుబోధ్ సింగ్ మధనపడుతుండేవాడని సమాచారం. ఆ తరువాతే ఆయన క్రిమినల్ గా మారిపోయాడని క్రమక్రమంగా దోపిడీ ముఠాలను తయారు చేసుకునే స్థాయికి చేరుకున్నాడని అనుమానిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలలో బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లేందుకు మాత్రమే ఈయన ముఠాలు ఆసక్తి చూపుతుండడంతో అతనికి గోల్డ్ థీఫ్ గా పేరు పడిపోయినట్టుగా తెలుస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగిన దోపిడీ కేసుల్లో సుబోధ్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. ఒకప్పుడు దేశ భద్రత విభాగంలో ఉద్యోగం సంపాదించుకున్న సుబోధ్ సింగ్ ఇప్పుడు దేశ అంతర్గత భద్రతకు సవాల్ విసిరే స్థాయికి చేరుకున్నాడని అంటున్నారు.
ఎంతో మంది…
వివిధ రాష్ట్రాలలో జరిగిన భారీ దోపిడీలలో సుబోధ్ సింగ్ అలియాస్ బాబువా పాత్ర ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ అతన్ని అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. 2018 నుండి బిహార్ లోని పూర్ణియా జైలులోనే ఉన్న సుబోధ్ సింగ్ ను ఇప్పటికే పలు రాష్ట్రాల పోలీసులు విచారించారు. 10 రాష్ట్రాల్లో జరిగిన దోపిడీలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల పోలీసులు అతన్ని జైలులో కలిసి దోపిడీలకు సంబంధించిన వివరాలు సేకరించారు. అలాగే అతని ప్రమేయం గురించి ఆరా తీసినప్పటికీ అరెస్ట్ చేసేందుకు మాత్రం సాహసించలేకపోయారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు అవసరమైన ఆధారాలు సేకరించలేకపోవడంతో సుబోధ్ సింగ్ ప్రమేయంపై మిన్నకుండిపోయారు. అయితే మే 3న కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో దోపిడీ ఘటన తరువాత సుబోధ్ సింగ్ ప్రమేయం గురించి సమాచారం అందుకున్న కమిషనర్ గౌష్ ఆలం అతన్ని అరెస్ట్ చేసేందుకు అవసరమైన కసరత్తులు చేశారు. జైలు నుండే దోపిడీలకు స్కెచ్ వేస్తున్న ప్రధాన సూత్రధారి అని అతన్ని కరీంనగర్ రాబరీ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉందని ఆరు కోర్టులలో పిటి వారెంట్ దాఖలు చేసి అరెస్ట్ చేసేందుకు ఆయా కోర్టుల అనుమతి తీసుకున్నారు.
సక్సెస్ అయితే…
కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ రాబరీ కేసులో సుబోధ్ సింగ్ ప్రమేయం ఉందని కరీంనగర్ కోర్టులో ఆధారాలు ప్రవేశపెట్టినట్టయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులకు మెయిన్ కేసు స్టడీగా మారే అవకాశం ఉంది. కరీంనగర్ పోలీసులు సుబోధ్ సింగ్ కు సంబంధించిన సాక్ష్యాలను ఎలా సేకరించారు..? అతని నేర ప్రవృత్తిని ఎలా గుర్తించారు..? ఆ వివరాలను సేకరించేందుకు దర్యాప్తు ఎలా చేశారు అన్న అంశాలను తెలుసుకునేందుకు పలు రాష్ట్రాల పోలీసులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది.