ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు బానిసై అప్పుల పాలై…

వృద్దురాలి కిడ్నాప్ హత్యాయత్నం కేసు…

వారం రోజుల పాటు రెక్కీ…

దిశ దశ, కరీంనగర్:

సామాజిక మాధ్యమాల్లో వచ్చే గేమింగ్స్ కారణంగా ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు కటకటాల పాలయ్యాడు. ఆన్ లైన్ గ్యాంబ్లిగ్ కు బానిసగా మారి అప్పుల ఊబి నుండి బయటపడేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. కూలీ పని పేరిట ఓ వృద్దురాలిని కిడ్నాప్ చేసి ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు లాక్కుని హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంఘటనా వివరాల్లోకి వెలితే… జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన ధమ్మ దినేష్ రెడ్డి (21) డిగ్రీ సెకండ్ ఈయర్ చదువుతున్నాడు. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ DIUWIN,జియో లాటరీ, కలర్ ట్రేడింగ్ గేమ్స్‌కు బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలో రూ. 4 లక్షల వరకూ అప్పుల కావడంతో పాటు లోన్ యాప్స్ ద్వారా కూడా రుణాలు తీసుకున్న చేసిన దినేష్ రెడ్డి తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో తీసుకున్న అప్పు చెల్లించాలని ప్రైవేటు వ్యక్తులు, యాప్స్ ప్రతినిధుల నుండి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయి. ఈ అప్పుల ఊబి నుండి ఎలాగైనా బయటపడాలని ఆలోచించి దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించాడు.

వారం పాటు రెక్కీ…

అప్పులు చెల్లించేందుకు చోరీలు చేయాలని భావించిన దినేష్ రెడ్డి కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించాడు. ఆయా చోట్ల ఒంటరి మహిళలపై ఉన్న నగలను ఎత్తుకెళ్లాలని భావించి చివరకు టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద కాపు కాశాడు. జులై 1న ఉదయం 10 గంటల సమయంలో కరీంనగర్ టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద కూలీ పని కోసం ఎదురు చూస్తున్న గంగాధర లక్ష్మీ (55)ను కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేశాడు. కూలీ పని ఉందని గంగాధర లక్ష్మీకి చెప్పి రాపిడో యాప్ ద్వారా బైక్ బుక్ చేసి నుస్తులాపూర్ వైపు తీసుకెళ్లాడు. అక్కడకు చేరుకున్న తరువాత ఆమె ఒంటిపై ఉన్న 5 గ్రామలు బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి మట్టెలను లాక్కుని ఆమెను బావిలోకి తోసేశాడు. లక్ష్మీని చంపినట్టయితే తనను ఎవరూ గుర్తు పట్టరని భావించి బావిలోకి తోసేసినప్పటికీ ఆమెకు ఈత రావడంతో తాడును పట్టుకుని వేలాడింది. ఈ విషయాన్ని గమనించిన నిందితుడు ఆ తాడును కోసి పరార్ అయ్యాడు. అయితే మరో వైపున ఉన్న ఇంకో తాడు ఊతంతో 2వ తేది ఉదయం వరకు వ్యవసాయ బావిలోనే ఉండిపోయింది. మరునాటి ఉదయం బావి నుండి అరుపులు వినిపించడంతో స్థానికులు ఆమెను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తన తల్లి ఆచూకి లేకుండా పోయిందని లక్ష్మీ తనయుడు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె మొబైల్ టవర్ లొకేషన్ తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ఏరియాలో వస్తోందని పోలీసులు చెప్పారు. నిందితుడు దినేష్ రెడ్డి లక్ష్మీ వద్ద ఎత్తుకెళ్లిన నగలను కరీంనగర్ లో రూ. 30 వేలకు విక్రయించగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద మొబైల్ ఫోన్, బాదితురాలి మొబైల్ ఫోన్, బైక్, రూ. 5 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. దినేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని సీపీ గౌష్ ఆలం మీడియాకు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్ కె రామచందర్ రావు, ఇన్స్పెక్టర్ తిరుమల్, ఎస్సైలు సుమన్, చేరాలు, భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్, పోలీస్ కానిస్టేబుళ్లు లక్ష్మిపతి, రాజ్‌కుమార్, ప్రశాంత్ లను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు.

crimecrime newskarimnagarKARIMNAGAR POLICELatest News
Comments (0)
Add Comment