మునిసిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ కేస్…

ఇద్దరి అరెస్ట్… ఒకరి పరార్…

దిశ దశ, జగిత్యాల:

జగిత్యాలలోని పాత ఇంటికి అసెస్ మెంట్ కాపీపై ఏకంగా మునిసిపల్ కమిషనర్ సంతకం చేసిన కేసులో ఇద్దరు నిందితులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… పట్టణంలోని తులసినగర్ కు చెందిన సమిండ్ల రాజేష్, సమిండ్ల గంగరాజుల తాత పేరిట ఉన్న ఆస్తికి రిజిస్టర్డ్ పార్టిషన్ డీడీ చేయించుకునేందుకు డాక్యూమెంట్ రైటర్ దిండిగాల శ్రీనివాస్ ను సంప్రదించారు. మునిసిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్ ఎస్ ఐ సుధాకర్ దర్యాప్తు చేపట్టి నిందితులైన సమిండ్ల రాజేష్, డాక్యూమెంట్ రైటర్ దిండిగాల శ్రీనివాస్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశించడంతో జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు సమిండ్ల గంగరాజు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడం, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పత్రాలను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఐ పి కరుణాకర్ స్పష్టం చేశారు. అయితే రిజిస్టర్డ్ పార్టిషన్ డీడ్ డాక్యూమెంట్లు సిద్దం అయిన తరువాత వాటిని ఆఫీసు నుండి ఎవరు తీసుకెళ్లారన్న విషయంపై చర్చ సాగుతోంది. అయితే వాటిని తీసుకున్నట్టుగా సమిండ్ల కుటుంబానికి చెందిన వారు పేరు ఉన్నప్పటికీ వారు మాత్రం తీసుకెళ్లలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిజిస్టర్డ్ పార్టిషన్ డాక్యూమెంట్ తీసుకెళ్లిన రోజుకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ సమిండ్ల రాజేష్ కానీ, సమిండ్ల గంగరాజు కానీ డాక్యూమెంట్స్ తీసుకోనట్టయితే వాటిని మరో వ్యక్తికి ఇవ్వడం కూడా నిబంధనలకు విరుద్దమేనని తెలుస్తోంది. వాస్తవ హక్కు దారులు కాకుండా ఇతరులకు రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు డాక్యూమెంట్లు  అప్పగించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నది కూడా తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ వ్యవహారంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం కూడా శాఖాపరంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యూమెంట్ రైటర్ల ప్రమేయం తీవ్రంగా పెరిగిపోయిందని ఏసీబీ దాడులతో స్పష్టం అయిపోయింది. కొన్ని చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు డాక్యూమెంట్ రైటర్ల ద్వారా మామూళ్లు తీసుకుంటున్నట్టుగా తేలింది. మంద కిరణ్ కుమార్ పెద్దపల్లి ఇంఛార్జి ఎస్ఆర్ఓగా పని చేసిన సమయంలో డాక్యూమెంట్ రైటర్ల ద్వారా మామూళ్లు తీసుకున్నారని, యూపీఐ పేమెంట్ల ద్వారా ఈ లావాదేవీలు జరిగాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరు డాక్యూమెంట్ రైటర్లను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. జగిత్యాలలో మునిసిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి అసెస్ మెంట్ కాపీని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పించిన విషయంలో కూడా డాక్యూమెంట్ రైటర్ దిండిగాల శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు కూడా శాఖాపరంగా విచారణ జరిపించినట్టయితే డాక్యూమెంట్ రైటర్ల ప్రమేయాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అంటున్నారు స్థానికులు.

AssessmentJAGITIAL NEWSLatest NewsOffline dataOnline data
Comments (0)
Add Comment