కరీంనగర్ లో కలకలం…
ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట…
కోడలే కారణమంటున్న మామ…
దిశ దశ, కరీంనగర్:
భార్య వేదింపులకు తాళలేక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిర ఘటన స్థానికంగా కలకలం లేపింది. బంగారం ఆభరణాలు తేవాలంటు… పుట్టినింటి వారిని కలవకూడదంటూ మానసికంగా హింసించిన కారణంగానే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతని తండ్రి ఆరోపిస్తున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్న కళ్యాణం రాకేష్ (27) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి కళ్యాణం రవి కరీంనగర్ రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం… కొత్తపల్లికి చెందిన రాకేష్ (27), హైదరాబాద్ నగరానికి చెందిన సంజనా అలియాస్ వర్ష (30)ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. 2024లో వివాహం చేసుకున్న తరువాత తీగలగుట్టపల్లిలోని సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుండి రాకేష్ తల్లిదండ్రులను కలవకుండా ఫోన్ లో మాట్లాడకుండా వర్ష అడ్డుకుంటోంది. బంగారు ఆభరణాలు చేయించాలని తరుచూ వేధింపులకు గురి చేసేదని దీంతో రాకేష్ మానసికంగా ఇబ్బందులు పడేవాడని అన్నారు. శనివారం మద్యాహ్నం 3.30 గంటల సమయంలో అతని బంధువైన శ్రీనివాస్ కు ఫోన్ చేసి ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల తన తల్లిదండ్రులకు దూరం అయ్యానని, టార్చర్ కు గురవుతున్నానని మీరు వచ్చే సరికి బ్రతికి ఉంటానో లేదోనని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అప్పుడు అందుబాటులో లేని శ్రీనివాస్ తన స్నేహితుడైన వినోద్ ను రాకేష్ ఇంటికి పంపించాడు. శ్రీనివాస్ రాకేష్ ఇంటికి చేరుకుని హాల్లో ఉన్న వర్షను అతని గురించి అడిగాడు. బెడ్రూంలో ఉన్నాడని చెప్పడంతో వినోద్ ఆ గదిలోకి వెళ్లి చూసే సరికి చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉన్నాడు. వెంటనే రాకేష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తండ్రి రవికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. బంగారం కొనివ్వాలంటూ కోడలు వర్ష తన కొడుకును వేధించేదని ఈ విషయంలో గతంలో పలుమార్లు తనకు ఫోన్ చేసి రాకేష్ చెప్పాడని రవి ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కొడుకు వద్ద 4 తులాల బంగారం, రూ. 4 లక్షల నగదు, స్కూటీని కూడా వర్ష తీసుకుందని, రాకేష్ తమతో ఫోన్లో మాట్లాడనివ్వకపోయేదని, తాము కాల్ చేసినా ఫోన్ లాక్కుని తనే మాట్లేదని ఆరోపించాడు. తాను రాకేష్ ను ఏడాది క్రితం బతుకమ్మ పండుగ సమయంలో చూశానని రవి వెల్లడించాడు. మృతుని తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు.