30 ఏళ్ల ఉద్యోగం @ వందల కోట్ల ఆస్తులు…

హైదరాబాద్ జోన్ లోనే విధులు…

అంచనాలకు మించి సంపాదన…

డీఎస్పీ భీంరెడ్డిపై కేసు…

దిశ దశ, హైదరాబాద్:

మొదట కానిస్టేబుల్ గా పోలీసు విభాగంలో చేరిన ఆయన 1995లో ఎస్సైగా ఎంపికయ్యారు. టూ స్టార్ ఖాకీ యూనిఫాం వేసిన ఆయన 30 ఏళ్లలో సంపాదించిన అక్రమార్జన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. హైదరాబాద్ మహానగరంలో ఎస్సై నుండి డీఎస్పీ వరకు పని చేసిన శంకిరెడ్డి భీంరెడ్డి అక్రమ ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన భీంరెడ్డి గురించి మొదట ఏసీబీ అధికారులు సేకరించిన సమాచారాన్ని మించి ఆస్తులు లభ్యం కావడం సంచలనంగా మారింది. వందల కోట్ల ఆస్తులు కూడ బెట్టుకున్న ఆయనపై 1988 (2018లో సవరించబడినది)లోని సెక్షన్ 13(1)(బి) మరియు 13(2) అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. సుదీర్ఘ కాలం శాంతిభద్రతల విభాగంలో పని చేసిన బీంరెడ్డి ప్రస్తుతం పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS)లో డిప్యూటీ సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. ఎస్సై, సీఐ, డీఎస్సీగా ఆయన వివిధ చోట్ల పని చేసినప్పుడు కూడబెట్టుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 400 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా. భీంరెడ్డి నివాసం ఉంటున్న ఇంటితో పాటు మొత్తం 15 చోట్ల సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఆయన అక్రమ ఆదాయం గుట్టు విప్పారు.

ప్రైమ్ లోకేషన్స్…

డీఎస్పీ భీంరెడ్డి ప్రైమ్ లోకేషన్లలో స్థిరాస్థులు కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఆయన భూములు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల్లో… హైదరాబాద్ ఇబ్రహీంబాగ్ లో వెస్సెల్లా మెడోస్ లో విల్లా, టెలికాం నగర్ లో జీ ప్లస్ 2 ప్లస్ విత్ పెంట్ హౌజ్ నిర్మాణం చేసిన ఇళ్లు, టెలికాం నగర్ సాయిప్రభా రెసిడెన్సీలో ఫ్లాట్, క్రాంతి సియోన్ లో ఫ్లాట్, మణికొండ, ల్యాంకో హిత్స్ రోడ్ లో 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న జీ ప్లస్ 5 కమర్షియల్ కాంప్లెక్స్ లో వాటా, మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న కమర్షియల్ ప్లాట్, తెల్లపూర్ అభినంద రెసిడెన్సీలో రెండు ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ లో 500 చదరపు గజాల స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో రెండు చోట్ల 44 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగుళూరు దేవనహళ్లిలో ఒక ఎకరం భూమి, నాగోల్ కామినేని ఆసుపత్రి సమీపంలో 200 గజాల ప్లాట్, జీపీఆర్ హౌజింగ్ సొసైటీ సమీపంలో 400 గజాల ప్లాట్, పటాన్ చెరూ లో 400 గజాలు, 200 గజాల ప్లాట్లు రెండు, వికారాబాద్ జిల్లా మోమిన్ పేటలో వెయ్యి గజాల స్థలం 2 ఎకరాల భూమి, శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్ లో రూ. 75 లక్షల పెట్టుబడి, ముచ్చింతల్ సీసీ కుంటలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే బీంరెడ్డి ఇంట్లో రూ. 3.60 లక్షల నగదు, బినామి ఇంట్లో రూ. 40 లక్షలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, రూ. 19.91 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని ఏసీబీ అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ వాల్యూయేషన్ ప్రకారం ఉన్న విలువకంటే చాలా ఎక్కువ ధర బహిరంగ మార్కెట్ లో పలుకుతున్నందున ఆయన స్థిరాస్థుల విలువ దాదాపు 400 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బ్యాంకు లాకర్ కూడా ఉన్నట్టు గుర్తించిన అధికారులు దానిని తెరిచిన తరువాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మణికొండకు చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఆయన డీఎస్పీ భీంరెడ్డి బినామీలలో ఒకరని ఏసీబీ అధికార వర్గాలు చెప్తున్నాయి.

అస్వస్థత…

బీంరెడ్డి ఇంటికి ఏసీబీ అధికారులు చేరుకోవడంతో ఆయన ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఊహించని విధంగా ఏసీబీ అధికారులు ఇంటికి రావడంతో ఆయన అస్వస్థతకు గురి అయినప్పటికీ ఏసీబీ అధికారులు మాత్రం సెర్చింగ్ నిర్వహించడం మానలేదు. ఆయన ఇళ్లు, బినామీల వద్ద లభ్యం అయిన ఆస్తుల వివరాలు అంచనాలను మించి లభ్యం కావడం సంచలనంగా మారింది.

ACB RIDESACB searchesACB TELANGANADSP BHEEM REDDYTELANGANA ACB
Comments (0)
Add Comment