ఆగిన బస్సుల సైరన్… మోగిన సమ్మె సైరన్…

డిపోల్లో నిలిచిపోయిన బస్సులు…

స్తంభించిన రవాణా వ్యవస్థ…

దిశ దశ, హైదరాబద్:

తెలంగాణ వ్యాప్తంగా బస్సుల హారన్ల మోతలు నిలిచిపోయాయి…  కార్మికుల సమ్మె పిలుపుతో ఆర్టీసీ డిపోలన్ని నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. 32 డిమాండ్లను పరిష్కరించాలని ప్రతిపాదించినా ఒక్క డిమాండ్ పరిష్కరించేందుకు కూడా కమిటీ ముందుకు రాలేదు. మంగళవారం దాదాపు మూడు గంటల పాటు ప్రభుత్వం నియమించిన కమిటీ, ఆర్టీసీ కార్మిక నేతలు చర్చలు జరిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుక ప్రభుత్వం ముందుకు రాలేదంటూ జేఏసీ నేతలు ప్రకటించారు. ప్రజా పాలన చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ తరహా పాలనే కొనసాగిస్తోందని విమర్శించారు. సమ్మెకు తమతో పాటు కలిసి రావాలని కాంట్రాక్టు ఉద్యోగులు, ఫారిన్ సర్విస్ డ్యూటీ చేస్తున్న వారిని కూడా జేఏసీ అభ్యర్థించింది. మంగళవారం అర్థరాత్రి నుండి సమ్మెకు దిగుతామని జేఏసీ ప్రకటించింది. త దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులన్ని ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.

ప్రత్యామ్నాయం…

రాష్ట్ర ప్రభుత్వం రవాణా వ్యవస్థను యథావిధిగా కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ప్రైవేటు ఉద్యోగుల ద్వారా బస్సులను నడిపించే యోచనలో ఉన్నట్టుగా మంగళవారం రాత్రి నుండి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో డిపోలు, బస్ స్టేషన్ ల వద్దకు చేరుకుని నిరసనలు చెప్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ డిపోల ముందే ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బస్సులను నడిపిస్తే అడ్డుకోవాలని కార్మికులు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్ల వద్ద ఉధ్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. భారీ సంఖ్యలో పోలీసులను ఆర్టీసీ డిపోలు, బస్ స్టేషన్ల వద్ద మోహరించింది ప్రభుత్వం.

ప్రయాణికుల పాట్లు…

మంగళవారం రాత్రి ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునివ్వడంతో గమ్య స్థానాలకు చేరుకునేందుకు ప్రయాణీకులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం ఉదయం బస్ స్టేషన్లకు చేరుకునే సరికి ఆర్టీసీ సమ్మె విషయం తెలియడంతో ఎక్కడివారు అక్కడే చిక్కుకున్నారు. దీంతో గమ్యానికి చేరుకునేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Latest NewsRTC JACRTC strikeTG NEWSTRANSPORT
Comments (0)
Add Comment