ఇటు నుండి బియ్యం… అటు నుండి ధాన్యం…

సరిహద్దుల్లో చెలరేగిపోతున్న మాఫియా…

మంథని పోలీస్ స్టేషన్ లో కేసు…

దిశ దశ, మంథని:

అడ్డదారుల గుండా అక్రమాలకు తెరలేపే ఘనులకు గోదావరి తీరం రాచమార్గంగా మారిపోయింది. అడ్డుకునే వారు లేరన్న ధీమాతో ఇష్టారీతిన స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు అక్రమార్కులు. తాజాగా మంథని పోలీస్ స్టేషన్ లో నమోదయిన కేసుతో అక్రమ రవాణా గుట్టు వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్ర…

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లెపల్లిలో PACS ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి మహారాష్ట్ర నుండి ధాన్యం అక్రమ రవాణా చేశారు. నకిలీ ట్రక్ షీట్లను తయారు చేసిన అక్రమార్కులు పొరుగు రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు తరలించి అక్రమంగా విక్రయాలు చేస్తున్నారు. అక్కడ తక్కువ ధర ఉండడంతో తెలంగాణాలోని గోదావరి తీర ప్రాంత కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. మూడు లారీల్లో మహారాష్ట్ర నుండి స్మగ్లింగ్ చేసిన ధాన్యానికి మల్లెపల్లి కొనుగోలు కేంద్రానికి సంబంధించిన నకిలీ ట్రక్ షీట్లను సృష్ఠించినట్టుగా తేలింది. రూ. 20,97,039 విలువైన 885.29 క్వింటాళ్ల ధాన్యాన్ని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. అంతేకాకుండా 2,168.40 క్వింటాళ్ల ధాన్యానికి మరో ఎనిమిది నకిలీ ట్రక్ షీట్లను కూడా క్రియేట్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. మంథని PACS కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ ఫిర్యాదు మేరకు మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. క్రై నంబర్ 137/2026లో 318(4), 316 (4), 316 (5), 338, 61 (2) BNS యాక్టులలో కేసు నమోదు చేశారు. నిందితులుగా పీపీసీ ఇంఛార్జి బి సందీప్, ట్యాబ్ ఆపరేటర్ తాళ్ల నరేష్, స్టాఫ్ అసిస్టెంట్ ఎస్ నరేష్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచకు చెందిన తాళ్ల అంజి, తాళ్ల శేఖర్, రమేష్, పిట్టల అర్జున్ కార్తికేయ, కోలకాని రవి కుమార్, స్టాఫ్ అసిస్టెంట్ ఎస్ నరేష్ సోదరుడు ఎస్ హరీష్, కడియాల రాకేష్, తాటి రేణికలుగా పేర్కొన్నారు.

దారి మార్చారా..?

గత సంవత్సరం చెన్నూరు ప్రాంతానికి మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాలో పండించిన ధాన్యం పెద్ద ఎత్తున అక్రమంగా తరలించే వారని అక్కడి కొనుగోలు కేంద్రాలలో వీటిని విక్రయించి సొమ్ము చేసుకునేవారని తెలుస్తోంది. సరిహద్దు గ్రామాల్లోకి భారీగా ధాన్యాన్ని విక్రయించి దళారులు పెద్ద ఎత్తున సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. గత సీజన్ లో ధాన్యం అక్రమంగా తరలించి విక్రయించారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి అక్కడి పోలీస్ స్టేషన్ లలో. ఈ సారి కూడా చెన్నూరు ప్రాంతానికి అక్రమంగా ధాన్యం తరలిస్తున్న క్రమంలో అక్కడి అధికారులు నిలువరించారు. ప్రాణహిత నదిపై ప్రత్యేకంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో మహారాష్ట్ర నుండి ధాన్యం అక్రమ రవాణాకు కొంతమేర అడ్డుకట్ట పడింది. అయితే తాజాగా మంథని సమీపంలోని మల్లెపల్లి కొనుగోలు కేంద్రం వద్ద మహారాష్ట్ర ధాన్యాన్ని పట్టుకోవడంతో దళారులు రూటు మార్చినట్టుగా స్పష్టం అవుతోంది.

బియ్యం అటు…

ఇకపోతే తెలంగాణ రేషన్ దుకాణాల్లో ఉచితంగా సరఫరా చేస్తున్న సన్న బియ్యం భారీ ఎత్తున మహారాష్ట్రలోని సిరొంచకు తరలిపోతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సిరొంచ శివార్లలో ప్రత్యేకంగా తెలంగాణ రేషన్ బియ్యం కొనుగోలు కోసం కేంద్రం ఏర్పాటు చేశారంటే అక్కడికి ఏ స్థాయిలో స్మగ్లింగ్ అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ప్రాంతం మీదుగా భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో మూడు నెలల కోసారి రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సమయంలో మాత్రమే సిరొంచలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. జులై మొదటి వారంలో మళ్లీ రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సిరొంచలోని కొనుగోలు కేంద్రం తిరిగి తెరుచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ప్రచారం మొదలైంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని రేషన్ బియ్యం సరఫరా చేసే ఏజెంట్లు సమాయత్తం అవుతున్నారు.

chennurkaleshwaramMANTHANIPaddy ProcurementSmuggling of ration rice
Comments (0)
Add Comment