ఇంటి దొంగల పనే… ముగ్గురిని హైర్ చేసుకున్న ఘనులు…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ భగత్ నగర్ ఓ ఇంట్లో జరిగిన దోపిడీ కేసును ఛేదించారు కరీంనగర్ పోలీసులు. ఇంటి సొంత అల్లునితో పాటు మనవడే ప్రధాన సూత్రధారిగా రాబరీకి పాల్పడ్డారు. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన ముగ్గురు నిందితులను ఈ కేసులో అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇటీవల భగత్ నగరల్ జరిగిన దోపిడీ కేసులో రూ. 20 లక్షల నగదు, 60 తులాల వరకూ బంగారం ఎత్తుకెళ్లిన నిందితులు పట్టుకునేందుకు కరీంనగర్ పోలీసు బృందం ప్రత్యేకంగా మీరట్ కు వెళ్లింది. సాంకేతికతతో పాటు క్షేత్ర స్థాయిలో విచారణలో లభించిన ఆధారాల ప్రకారం ముఠాను పట్టుకున్నారు. నిందితుల నుండి రూ. 2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడి టాయ్ పిస్తోల్ వంటి మారణాయుధాలను చూపించి కుటుంబ సభ్యులను కట్టేసి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), పండ్ల వ్యాపారి, సల్మాన్ @ విమాన్ (22), కూలీ, మొహమ్మద్ హసీన్ (19)లను అరెస్ట్ చేయగా, ఎం.డి. అజ్మత్ అలీ సొంత అల్లుడు రజావుద్దీన్, మనువడు అజీమ్ రజాలు పరారీలో ఉన్నారు. వీరిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు ప్రకటించారు. రజావుద్దీన్ పై నేర చరిత్ర ఉందని కుటుంబ కలహాల కారణంగా అతని భార్య గత సంవత్సరం పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఆ తరువాత అల్లుడు రజావుద్దీన్ అత్తింటికి వచ్చి భార్యను తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె సానుకూలత వ్యక్తం చేయలేదు. దీంతో మరోసారి వచ్చి అత్తింట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో అతనికి చికిత్స చేయించిన అత్తింటి వారు కరీంనగర్ లోనే నివాసం ఉండాలని సూచించారు. వ్యాపారం చేసేందుకు కూడా చేదోడుగా నిలిచినప్పటికీ రూ. 5 లక్షలు ఇవ్వాలని అత్తంటి వారితో గొడవ పడి మంచిర్యాలలో కొత్త షాపు పెడుతున్నాని చెప్పి కారులో మీరట్ కు వెళ్లిపోయాడు. అక్కడే ముఠాను ఏర్పాటు చేసుకుని దోపిడీకి పాల్పడ్డాడు. ఈ నెల 20న మీరట్ నుండి రైల్లో రామగుండం చేరుకున్న ఈ ముఠా సభ్యులు అజ్మత్ అలీ ఇంట్లోకి చొరబడి దోపిడీ చేసి హుజురాబాద్ సమీపంలోని పెద్దపాపయ్య పల్లి వరకూ బైకులపై వెళ్లి అక్కడ వాటిని పడేసి పరార్ అయ్యారు.
గుర్తించలేదా..?
అయితే దోపీడీకి పాల్పడిన సమయంలో నిందితులు మాస్కులు ధరించినప్పటికీ ఇంటి అల్లుడు, మనవడు కూడా ప్రత్యక్ష్యంగా పాల్గొన్నాడని, వారిని గుర్తు పట్టకపోవడం ఏంటన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దోపిడీ చేసిన రోజున అజ్మత్ అలీ అతని పెద్ద కూతురిని తీవ్రంగా కొట్టినప్పుడు వారి కళ్లు చూసైనా గుర్తించాల్సి ఉంటుందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారం వెనక ఇతర కుటుంబ సభ్యుల సహకారం ఏమైనా ఉందా అన్న విషయంపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కరీంనగర్ లో సంచలన దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో భగత్ నగర్ దోపిడీ కేసు మిస్టరీని ఛేదించి సఫలం అయ్యారు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు.