సీఎంఆర్ ఎగవేత ఎఫెక్ట్…. ఫ్యామిలీ పరార్…

బీజేపీ నాయకుని కుటుంబంపై కేసు

దిశ దశ, జగిత్యాల:

కస్టం మిల్లింగ్ రైస్ (CMR) ఎగవేతలో బీజేపీ నాయకుని కుటుంబం తతంగం బయటపడింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కొండ లక్ష్మణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు రైస్ మిల్లులు ఉన్నాయి. సీఎంఆర్ ద్వారా సేకరించిన ధాన్యానికి తగిన బియ్యాన్ని లెవీ చెల్లించలేదు. జగిత్యాల సమీపంలోని తక్కల్లపల్లిలోని శ్రీ అభయాంజనేయ సాయి, లక్ష్మీ బాలాజీ, లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్‌ల ద్వారా 34,386.785 మెట్రిక్ టన్నుల బియ్యం FCIకి అప్పగించాల్సి ఉంది. రూ. 87.89 కోట్ల విలువైన రైస్ ప్రభుత్వానికి అప్పగించ లేదని సివిల్ సప్లై అధికారులు లెక్క తేల్చారు. దీంతో కొండ లక్ష్మణ్, అతని భార్య, జగిత్యాల మునిసిపల్ కౌన్సిలర్ కొండ అరుణ (బీజేపీ), అతని సంతానం కొండ ప్రణిత్, కొండ ఉపేందర్ లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సీఎంఆర్ రైస్ దారి మళ్లించారని నిర్దారించిన సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు మిల్లులను పరిశీలించి భారీ స్కాంకు పాల్పడ్డారని నిర్దారించారు. ఈ మేరకు కొండ లక్ష్మణ్ అతని కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు.

బీజేపీకి షాక్…

ఇటీవల జరిగిన మునిసిల్ ఎన్నికల్లో ఛైర్ పర్సన్ పదవిని ఆశించిన కొండ లక్ష్మణ్ భార్య అరుణ కౌన్సిలర్ గా గెలిచారు. మెజార్టీ రాకపోవడంతో కౌన్సిలర్ తోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఒక వేళ మెజార్టీ వచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీకి తీరని డ్యామేజ్ వాటిల్లేది. ఇప్పటికే బీజేపీ కౌన్సిలర్ కుటుంబం సీఎంఆర్ ఎగవేశారన్న ప్రచారం సాగుతోంది. కీలక పదవిలో ఉన్నట్టయితే సంచలనంగా మారిపోయేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

హల్ చల్…

జగిత్యాల పట్టణంలో సంచలనంగా మారిన కొండ లక్ష్మణ్ వ్యవహారం గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన జన్మదిన వేడుకల్లో హంగామా చేశారని, కేక్ కట్ చేసేందుకు తల్వార్లు ఉపయోగించారని అంటున్నారు స్థానికులు. ఒకప్పుడు తల్వార్లతో బర్త్ డే చేసుకున్న వ్యక్తి నేడు అధికారులకు చిక్కకుండా తప్పించుకోవల్సిన పరిస్థితి రావడం ఏంటన్న చర్చ సాగుతోంది.

ఓల్డ్ డ్యూ….

మరోవైపున కొండ లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు అలాట్ చేసిన ధాన్యానికి అనుగుణంగా బియ్యాన్ని గతంలో కూడా సరఫరా చేయనట్టుగా తెలుస్తోంది. రూ.87.89 కోట్ల విలువైన బియ్యంలో రూ. 30 కోట్ల వరకు గతంలో బకాయి ఉన్నట్టుగా సివిల్ సప్లై రికార్డులు చెప్తున్నాయి. అయితే సీఎంఆర్ రైస్ అప్పగించనప్పుడు తిరిగి అదే మిల్లులకు మరో సీజన్ లో మర ఆడించేందుకు ధాన్యం ఎలా సరఫరా చేశారన్నదే అంతు చిక్కకుండా పోతోంది.

విదేశాలకెళ్లారా..?

రెండు రోజుల క్రితం సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నమోదయిన తరువాత కొండ లక్ష్మణ్ జగిత్యాలను వీడి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారని పోలీసు వర్గాల సమాచారం. లక్ష్మణ్ సంతానాన్ని పిలిపించాలని సూచించిన పోలీసు అధికారులపై కూడా ఎదురు తిరిగి వెళ్లిపోయినట్టుగా స్థానికంగా ప్రచారం అవుతోంది. అనంతరం సివిల్ సప్లై విభాగం ఉన్నతాధికారుల ద్వారా తనపై పెట్టిన కేసులు ఉప సంహరించుకునే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. కానీ సదరు ఉన్నతాధికారి ఈ ప్రతిపాదనను తిరస్కరించడంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నట్టు ప్రచారం. అయితే కుటుంబం విదేశాలకు వెళ్లిపోయి ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఒకరిద్దిరికి పాస్ పోర్టులు లేనట్టుగా తెలుస్తోంది.

ఎల్ఓసీ..?

అయితే కొండ లక్ష్మణ్ కుటుంబ సభ్యులు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుక్ ఔట్ సర్క్యూలర్ (LOC) జారీ చేసేందుకు రంగం సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. మరో వైపున ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్టుగా కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

civil suppllycmrflash newsJAGITIAL NEWSLOC
Comments (0)
Add Comment