జైలు గోడల నుండే దేశ వ్యాప్త నెట్ వర్క్… కింగ్ పిన్ కోసం పీటీ వారెంట్…

త్వరలో కరీంనగర్ కోర్టుకు బాబువా

దిశ దశ, కరీంనగర్:

జైలు గోడల నుండే టార్గెట్ ఛేదిస్తాడు… కారాగారంలో ఉంటూనే దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ కొనసాగిస్తున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేసుకున్న మోస్ట్ వాంటెడ్ గోల్డ్ థీప్ ను పట్టుకునేందుకు కరీంనగర్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు. పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పరిచేందుకు రంగం సిద్దం చేశారు. జాతీయ స్థాయిలో సంచలనాల దోపిడీ ఘటనల్లో కీలక సూత్రధారిగా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్ అలియాస్ బాబువానే కింగ్ పిన్ అని కరీంనగర్ పోలీసులు పీఎంజే జ్యువెల్లరీస్ ఘటనలో తేల్చేశారు. దీంతో అతన్ని తమకు అప్పగించాలని కోరడం ఇందుకు సంబంధించిన అనుమతులు కూడా రావడంతో కరీంనగర్ నుండి ప్రత్యేక పోలీసు బృందం బీహార్ లోని పుర్నియా కేంద్ర కారాగారానికి వెళ్లనున్నారు.

అరెస్ట్…

బిహార్ లోని నలంద జిల్లాకు చెందిన సుబోధ్ సింగ్ 2018లో అరెస్ట్ అయిన తరువాత కూడా దేశ వ్యాప్తంగా విస్తృతమైన నెట్ వర్క్ నడుపుతున్నాడని పోలీసులు గుర్తించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 70 నుండి 100 మంది అనుచరులతో ప్రత్యేక ముఠాను నడుపుతున్నాడని అంచనా వేస్తున్నారు. సుబోధ్ సింగ్ నడిపించే నెట్ వర్క్ ను “కార్పొరేట్ క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్”గా పోలీసులు అభివర్ణిస్తున్నారు. భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు దోచుకెళ్లేందుకు ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించి పక్కాగా రెక్కి చేయించి, ఆయుధాలు ఉపయోగించేందుకు అవసరమైన వ్యూహ రచనను అమలు చేస్తారని అంటున్నారు. సుబోధ్ సింగ్ కు సంబంధించిన ఈ బృందాలు దేశంలో సంచలనాలు కల్గించిన పలు దోపీడీల్లో పాల్గొన్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. 2023లో డెహ్రడూన్ లోని రిలయన్స్ జ్యువెల్లరీ దోపిడీ, మధ్యప్రదేశ్ లోని కట్నీలోని మన్నపురం గోల్డ్ లోన్ దోపిడీ, 2024లో పూర్నియాలోని తనిష్క్ షోరూం దోపిడీ తదితర ఘటనలతో సుబోధ్ సింగ్ అలియాస్ బాబువాకు సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్రాన్సిట్ వారెంట్…

దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ పోలీసులు కూడా సుబోధ్ సింగ్ అరెస్ట్ చేసేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే కరీంనగర్ పీఎంజే జ్యువెలరీస్ దోపిడీ ఘటనలో సుబోధ్ సింగ్ ను అదుపులోకి తీసుకునేందుకు అవసరమైన ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే పోలీసులు బిహార్ లోని పుర్నియా జైలుకు వెల్లి ఘరానా గ్యాంగ్ లీడర్ ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మే 3వ తేదిన కరీంనగర్ జ్యోతినగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాపులో 1600 గ్రాముల బంగారు ఆభరణాలను దోపిడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముఠా సభ్యులు రఘునాథ్ కర్మాకర్, రవీష్ కుమార్ తో పాటు వీరికి సిమ్ కార్డులు సమకూర్చిన మెహతాబ్ ఖాన్ ను కరీంనగర్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులుగా ఉన్నారని గుర్తించిన కరీంనగర్ పోలీసులు ప్రత్యక్ష్యంగా దోపిడీలో పాల్గొన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో సుబోధ్ సింగ్ ను కరీంనగర్ కోర్టులో హాజరు పర్చి పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా జరిగిన రాబరీ ఘటనలు ఎలా చేశారు..? జైలులో ఉన్నా నెట్ వర్క్ నిర్వహించడం ఎలా సాధ్యమవుతోంది..? కరీంనగర్ జ్యువెలరీలో దోపిడీ చేసిన ఆభరణాల రికవరీ వంటి అంశాలపై ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. కింగ్ పిన్ గా భావిస్తున్న సుబోధ్ సింగ్ ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత దేశంలోనే అత్యంత అరుదైన కేసుగా రికార్డుకెక్కనుంది.

BIHARcrime newskarimnagarPMJ Jewellery ShowroomRobbery Gang
Comments (0)
Add Comment