ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాయేనా..? ఏటీఎం చోరీ కేసు…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఏటీఎంను ఎత్తుకెళ్లిన ముఠా గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దోపిడీ ముఠానే ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని పోలీసు అధికారులు అంచనాకు వచ్చారు. ఏటీఎంను ఎత్తుకెళ్లిన దోపిడీ గ్యాంగ్ గురించి 10 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. కామారెడ్డి వైపు నుండి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా వైపునకు వచ్చినట్టుగా గుర్తించి ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చోరీ జరిగిన రోజే అక్కపెల్లి శివార్లలో ఏటీఎంను గుర్తించారు. దొంగలు ఏటీఎంనుఎత్తుకెళ్లి నగదు తీసుకుని మిషన్ ను అక్కపెల్లి శివార్లలో పడేశారు. అయితే మిషన్ పై వేలి ముద్రలు కనిపించకుండా ఉండేందుకు ముఠా పకడ్బందీగా వ్యవహరించింది. మిషన్ పై డిజిల్ పోయడంతో వేలి ముద్రలకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు చిక్కలేదు. ఏటీఎంలోని సీసీ కెమెరాల్లో ఒకదానిని పగలగొట్టిన ఇతర కెమెరాల్లో దొంగల కదలికలు రికార్డయినప్పటికీ క్లారిటీ లేకుండా పోయిందని సమాచారం. దీంతో ముఠా గురించి ఆరా తీసేందుకు వివిధ కోణాల్లో పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. కోనరావుపేట అటవీ ప్రాంతం మీదుగా ముఠా పరార్ అయినట్టుగా నిర్దారించారు. గూగుల్ మ్యాప్ సాయంతో జిల్లాను దాటి ఉంటారని భావిస్తున్నారు. కోనరావుపేట అటవీ ప్రాంతంలో పలు చోట్ల వాహనాలు వెళ్లి వెనక్కి వచ్చిన ఆనవాళ్లను గుర్తించారు పోలీసులు. ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లేందుకు రెక్కి నిర్వహించిన దోపిడీ ముఠా తిరిగి వెల్లేందుకు ఎంచుకున్న మార్గంపై వారికి స్పష్టత లేనట్టుగా అర్థం అవుతోంది.

ఈ తరహా…

ఎల్లారెడ్డిపేటలో ఏటీఎం మిషన్ కు తాడు బిగించి వాహనంతో లాగి పెకిలించుకుని పోయే ముఠాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్న వివరాలు సేకరిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. ఈ తరహాలో దేశంలో ఏదైనీ ప్రాంతంలో దోపిడీ జరిగినట్టయితే ముఠాల ఉనికి లభించిందా అన్న విషయాలు తెలుసుకుంటున్నట్టుగా సమాచారం. ఏఏ ప్రాంతంలో ఇలాంటి ముఠాలు సంచరించాయి..? ఆయా ముఠాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు..? వారి ఆకారాలు తదితర పూర్తి వివరాలను సేకరించినాఎల్లారెడ్డిపేట ఏటీఎం ఎత్తుకెళ్లిన ముఠా గురించి ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్, జాల్నా ప్రాంతాల్లో ఈ తరహా దోపిడీలకు పాల్పడే సెకిల్ కార్ గ్యాంగులు ఉంటాయని కూడా పోలీసులు సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఈ ముఠాకు సంబంధించిన వారు ఈ ప్రాంతానికి వచ్చాారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఆయా ప్రాంతాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని నిర్దారణకు వచ్చే పనిలో జిల్లా పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. మరోవైపున ఆయా ప్రాంతాల్లోని టవర్ల పరిధిలో సంచరించిన మొబైల్ నంబర్లను కూడా ట్రేస్ చేస్తున్నట్టుగా సమాచారం. కొత్త నంబర్లు ట్రాక్ చేసి వాటి ఆధారంగా కూడా ఆరా తీసినట్టయితే ముఠాను ఇట్టే పట్టకోవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అనుమానిత నంబర్ల వివరాలు సేకరించినా దోపిడీ ముఠా గురించి ఓ కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ATMcrime newsLatest Newsrajanna siricillaSBI
Comments (0)
Add Comment