తప్పుదారి పట్టిస్తున్నా… వదలని పోలీసులు… నగల షాపు దోపిడీ కేసు…

నేపాలీలతో చెట్టాపట్టాల్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపు దోపిడీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మే 3వ తేదిన కరీంనగర్ లో జ్యోతీనగర్ లో జరిగిన రాబరీపై పోలీసులు ముఠా కోసం వెటాడుతూనే ఉన్నారు. బృందాలుగా ఏర్పడిన కరీంనగర్ పోలీసులు పలు రాష్ట్రాల్లో నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు. అయితే అరెస్ట్ చేసిన నిందితులను విచారించినప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చి మిస్ గైడ్ చేశారని గుర్తించారు. కరీంనగర్ రాబరీ తరువాత బైకులు, ఆయుధాలు ముఠాకు చెందిన వేరే వారికి అప్పగించామని తాము బల్లార్షకు చేరుకుని పరార్ అయ్యామని పోలీసుల విచారణలో చెప్పారు. అయితే నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది. బల్లార్షా వరకు కూడా ముగ్గురు వెళ్లి అక్కడి నుండి రఘునాథ్ కర్మాకర్ మాత్రమే రైలులో పశ్చిమ బెంగాల్ కు వెళ్లిపోగా మిశ్రా అలియాస్ జీవన్ యాదవ్, జైనుల్ అబ్దిల్ లు బంగారం, ఆయుధాలు తీసుకుని వాహనంలోనే బీహార్ వరకు చేరుకున్నారన్న సమాచారాన్ని సేకరించారు. మొదట పట్టుబడిన నిందితులు పోలీసుల దృష్టి మరల్చినట్టయితే మిగతా టీమ్ అంతా సేఫ్ అవుతుందని భావించి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకున్న పోలీసులు తమను కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని గుర్తించారు. దీంతో బీహార్, పశ్చిమ బెంగాల్ లకు చెందిన గ్యాంగ్ మెంబర్స్ దోపిడీ చేసేందుకు ఎలా స్కెచ్ వేస్తారు..? రాబరీ చేసిన తరువాత ఎలా నడుచుకుంటారు..? కరీంనగర్ నగల షాపులో దోపిడీ చేసిన తరువాత ఏం చేశారు..? ఎలా వెళ్లారు అన్న కోణంలో ఆరా తీసినప్పుడు బీహార్ నుండి ధర్మపురికి చేరుకున్న క్రెటా కారులోనే తిరిగి వెళ్లారని వారితో పాటే ఆయుధాలు తీసుకెళ్లారని తెలుసుకున్నారు. వీరిలో ఒక్క రఘునాథ్ కర్మాకర్ మాత్రమే పశ్చిమబెంగాల్ కు ట్రైన్ ద్వారా వెళ్లాడని కూడా తెలుసుకున్న పోలీసులు మిగతా ముఠా సభ్యుల కోసం సెర్చింగ్ కొనసాగిస్తున్నారు.

నేపాలీల సహకారం…

ఇకపోతే బీహార్ లో ఎన్ కౌంటర్ తరువాత తల దాచుకునేందుకు నేపాల్ కు వెళ్లిన సుబోధ్ గ్యాంగ్ సభ్యునికి పరిచయం అయిన వ్యక్తి ద్వారా అక్కడ బంగారం విక్రయించడం మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే నేపాల్ లో ఇతర దేశాలకు చెందిన రాబరీ గ్యాంగ్స్ చోరీ సొత్తు విక్రయించినట్టయితే అక్కడి పోలీసులకు సమాచారం ఇస్తారని నేపాల్ దేశానికి చెందిన వారు అయితే పట్టించుకోరన్న విషయాన్ని తెలుసుకున్న ఈ గ్యాంగ్ నేపాల్ కు చెందిన నేరస్తులను ఈ వ్యవహారంలో భాగస్వాములను చేసినట్టుగా తెలుస్తోంది. నేపాల్ కు చెందిన ఈ టీమ్ మెంబర్ గోల్డ్ తీసుకెళ్లి అక్కడే విక్రయించి బీహార్ కు చెందిన ఈ ముఠాకు చెందిన కీలక వ్యక్తులకు నగదు పంపిస్తుంటారని సమాచారం. ముందుగా అనుకున్న ప్లానులో భాగంగానే కరీంనగర్ నగల షాపులో రాబరీ చేసిన నగలను బీహార్, నేపాల్ సరిహద్దుల్లోని ఓ గ్రామం వద్దకు తరలించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 13 మంది ప్రమేయం ఉన్నట్టుగా నిర్దారించిన పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా 14 మంది ఇన్ వాల్వ్ అయినట్టుగా తేల్చారు. రాబరీకి పాల్పడిన ఐదుగురిలో మరో ఇద్దరు దొరకాల్సి ఉండగా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

శశాంక్ కీలకం..?

అయితే దేశ వ్యాప్తంగా దోపిడీలకు ప్లాన్ చేయడం, వాటిని సక్సెస్ చేయడం వంటి వ్యవహారాలను చక్కబెట్టేందుకు సుబోధ్ సింగ్ కు అండగా శశంక్ ఉన్నట్టుగా తెలుస్తోంది. జైలు నుండి సుబోధ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బయట ఉన్న శశాంక్ రాబరీలు చేసి నగలను విక్రయించడం పనులు చూసుకునే వాడని తెలిసింది. శశాంక్ కు సంబంధించిన కీలక సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. శశాంక్ దొరికినట్టయితే దేశ వ్యాప్తంగా జరిగిన భారీ రాబరీలకు సంబంధించిన మిస్టరీని కూడా ఛేదించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సుబోధ్ గ్యాంగ్ గురించి కరీంనగర్ పోలీసులు వెలుగులోకి తీసుకరావడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఇతర రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు అక్కడ జరిగిన రాబరీ కేసుల్లో సుబోధ్ సింగ్ పేరును చేర్చి అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరారు. అయితే అతన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్ర పోలీసులు అక్కడి కోర్టులో హాజరు పరిచినట్టుగా తెలుస్తోంది.

మూడు రోజుల కస్టడీ…

ఈ కేసులో ఇన్ వాల్వ్ అయిన యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్, ఎండీ ఆదిల్ ఖాన్ లను మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. వీరిని గురువారం అదుపులోకి తీసుకున్న పోలీసులు రాబరీకి సంబంధించిన సమగ్ర వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. గ్యాంగ్ వేసే స్కెచ్ లో వీరిద్దరి పాత్ర ఏమిటీ..? వీరితో పాటు మరెవరైనా ఉన్నారా..? అన్న విషయాలను కూడా తెలుసుకోనున్నారు.

Gold Thief Subodh SinghKARIMNAGAR POLICEPMJ Jewellery ShowroomRobbery GangTG NEWS
Comments (0)
Add Comment