పెద్దపల్లి బైపాస్ రోడ్ సర్వేపై రైతుల ఆగ్రహం
దిశ దశ, పెద్దపల్లి:
బైపాస్ రోడ్ నిర్మించేందుకు శిలాఫలకం వేసిన చోట కాకుండా మరో చోట సర్వే ఎలా చేస్తున్నారని తమ భూములు లాక్కుంటే ఊరుకునేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం మీదుగా బైపాస్ రోడ్ నిర్మించాలన్న ప్రతిపాదన చాలా కాలంగా కొనసాగుతోంది. ఎట్టకేలకు ఇక్కడ బైపాస్ రోడ్ నిర్మాణం చేపట్టేందుకు స్థానిక ఎమ్యెల్యే చింతకుంట విజయ రమణా రావు నిధులు మంజూరు చేయించారు. ఇటీవల రోడ్డు నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే సోమవారం సర్వే అధికారులు మొదట ప్రతిపాదించిన ప్రాంతంలో కాకుండా వేరే చోట బైపాస్ రోడ్ కోసం సర్వే చేసేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న పెద్ద కల్వలకు చెందిన రైతులు సర్వే అధికారులను అడ్డుకున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ బాధిత రైతులు మాత్రం బైపాస్ రోడ్ నిర్మాణం తమ పంట పొలాల మీదుగా చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు.
శవాలపై వేసుకోండి…
మొదట ప్రతిపాదించి శంకు స్థాపన చేసిన చోట కాకుండా తమ భూములను సేకరించి బైపాస్ రోడ్ వేయడం సరికాదని తమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత రైతులు. ప్రభుత్వ భూమి ఉన్నందున మొదట ప్రతిపాదించిన చోట నుండే బైపాస్ నిర్మించుకుంటే ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుందని అంటున్నారు. తమకు ఉన్న కొద్దిపాటి భూమిని లాక్కుని బైపాస్ రోడ్ నిర్మించాలనుకుంటే తమ శవాల మీదుగా వేసుకోవాలని రైతులు స్పష్టం చేశారు. తమ భూములు కోల్పేతే తమకు ఇక మరణమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజీవ్ రోడ్…
బైపాస్ రోడ్ సర్వేకు వ్యతిరేకంగా రైతులు రాజీవ్ రహదారిపై పడుకుని నిరసన ప్రదర్శించారు. తమ పొట్టగొట్టే విధంగా భూములు తీసుకున్నట్టయితే సహించేది లేదని హెచ్చరించారు. రాజీవ్ రహదారిపై పడుకుని రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దశలో పోలీసులు అడ్డుకున్నా బాధిత రైతులు నిరసనను యథావిధిగా కొనసాగించారు.