ఆ ప్రకటన నామమాత్రమేనా..?
దిశ దశ, కరీంనగర్:
భారీ వాహనాల్లో ఓవర్ లోడ్ పై కఠినంగా వ్యవహరిస్తామని, లారీల సామర్థ్యం మేరకే రవాణా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ ప్రకటన చేసి పట్టుమని పది రోజులు కూడా కాలేదు. భూపాలపల్లిలో రవాణా శాఖ జిల్లా అధికారి వెంకన్న డ్యూటీలో ఉన్నప్పుడు బొగ్గు లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేథ్యంలోనే JTC ఓవర్ లోడ్ విధానాన్ని కట్టడి చేస్తామని ప్రకటించడంతో నిబంధనల మేరకే లారీల్లో రవాణా జరుగుతుందని భావించారంతా. కానీ కరీంనగర్ లో మాత్రం రవాణా శాఖ అధికారుల ఆదేశాలను పాటించేందుకు కొన్ని గ్రానైట్ క్వారీల నిర్వాహకులు ముందుకు రావడం లేదు. రవాణా శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు స్థానికంగా ఉన్న అధికారులు సాహసించడమూ లేదు. దీంతో జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు ప్రకటనలకే పరిమితం అయ్యాయన్న చర్చ సాగుతోంది.
పరిమితికి మించి…
కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ క్వారీల నుండి పరిమితికి మించి బ్లాకులను తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ వాహానాల గ్రాస్ వెయిట్ (GW) 55 టన్నులకు మించి రవాణా చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ క్వారీల నుండి మాత్రం 100 టన్నుల వరకూ రవాణా చేస్తున్నట్టుగా విమర్శలు ఉన్నాయి. గ్రాస్ వెయిట్ కు మించి రవాణా చేస్తున్నా వాహనాలను నిలువరించి చర్యలు తీసుకునేందుకు అధికారులు మీనామేషాలు లెక్కించడానికి కారణమేంటన్న చర్చ గ్రానైట్ క్వారీ నిర్వాహకుల్లో సాగుతోంది. బహిరంగంగానే సాగుతున్న ఈ వ్యవహారాన్ని కట్టడి చేయకపోవడానికి కారణమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది.
అప్పుడలా…
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎస్ హెచ్ ఓ గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో ఓవర్ లోడ్ తో వెల్తున్న దాదాపు వంద లారీలను పట్టుకుని జరిమానాలు విధించారు. అయితే రవాణా శాఖ అధికారులు మాత్రం ఈ విషయంపై స్పెషల్ డ్రైవ్ చేసి ఓవర్ లోడ్ ను కట్టడి చేయకపోవడం విస్మయం కల్గిస్తోంది. రెండు మూడు నెలల్లోనే భారీ సంఖ్యలో ఓవర్ లోడ్ లారీలను పట్టుకుంటే స్థానిక రవాణా శాఖా అధికారులు మాత్రం తమేకేమీ పట్టనట్టుగా వ్యవహరించిన తీరు సంచలనంగా మారింది.
ఇప్పుడిలా…
పోలీసు అధికారులు పట్టుకున్న ఓవర్ లోడ్ వాహానాల మాట అటుంచితే… సాక్షాత్తు తమ సొంత శాఖకు చెందిన అధికారి ప్రమాదంలో మరణించిన తరువాత ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. సహచర అధికారి మరణించిన తరువాత రాష్ట్ర స్థాయి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు సాహసించకపోవడం ఏంటన్నదే మిస్టరీగా మారింది.