దిశ దశ, పెద్దపల్లి:
విశ్వసించే అధికారి ముందు విశ్వాసం చూపించినా ఏసీబీకి చిక్కిన రోజు జైలు ఊచలు లెక్కించాల్సిందే. ప్రైవేట్ వ్యక్తులం తమను ఎవరు పట్టుకోరన్న ధీమాతో లంచం తీసుకుంటే మాత్రం అరెస్ట్ కాక తప్పదు. సదరు అధికారి ప్రాపకం కోసం UPI పేమెంట్స్ అయినా వసూలు చేస్తే మాత్రం కేసుల్లో చిక్కుకోక తప్పదు… తాజాగా కరీంనగర్ ఏసీబీ అధికారులు పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇద్దరు డాక్యూమెంట్ రైటర్లను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
వివరాలిలా…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ చోట్ల సీనియర్ అసిస్టెంట్, ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ (SRO)మంద కిరణ్ తన అసిస్టెంట్ బిట్టూ అలియాస్ రత్న కుమార్ ద్వారా UPI పేమెంట్స్ చేయించుకుంటూ లంచం వసూలు చేస్తున్నాడని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గత మే 12న నిజామాబాద్ లో అరెస్ట్ చేసిన తరువాత 14వ తేదిన పెద్దపల్లి SRO కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. 2025 అక్టోబర్ 27 నుండి 12 నవంబర్ వరకు అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటున్నట్టు తేల్చారు ఏసీబీ అధికారులు. అయితే ఈ కేసును అంతటితో వదిలేయకుండా వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంద కిరణ్ తో ఆర్థిక లావాదేవీలు జరిపిన వారిని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు. యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపిన ప్రైవేట్ డాక్యూమెంట్ రైటర్స్ అనుదీప్, సాయిలులను అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఫోన్ పే ద్వారా లావాదేవీలు జరిపినట్టుగా ఏసీబీ అధికారుల తేలడంతో అరెస్ట్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతోందని కూడా వెల్లడించారు.