దిశ దశ, చెన్నూరు:
మంచిర్యాల జిల్లా వేలాల ఇసుక క్వారీ నుండి తరలి వెలుతున్న లారీలను బుధవారం అర్థరాత్రి స్థానికులు, కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. నిభందనలుకు విరుద్దంగా ఇసుక తరలిస్తున్నారన్న అనుమానంతో లారీలను అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. జైపూర్ పోలీస్ స్టేషన్ ముందు బారులు తీరిన ఈ లారీలకు సంబంధించి విచారణ జరపాలని మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. లారీల్లో తరలిపోతున్న ఇసుకకు సంబంధించిన వే బిల్లులు ఉన్నాయా..? ఓవర్ లోడ్ ద్వారా తరలిస్తున్నారా అన్న విషయంపై మైనింగ్ అధికారులు ఆరా తీయనున్నారు. ఒక వేళ వే బిల్లులు లేకపోయినా, ఓవర్ లోడ్ ఉన్నా మైనింగ్ అధికారులు సదరు లారీలకు పెనాల్టీ వేసే అవకాశం ఉంది.
రీ సైక్లింగ్..?
మరో వైపున వేలాల రీచు నుండి అర్థరాత్రి ఇసుక తరలిస్తున్న విషయంపై సరికొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. అర్థరాత్రి అయితే ఎవరూ అడ్డుకోరని భావించే లారీలను పంపించి ఉంటారన్న చర్చ స్థానికంగా సాగుతోంది. రాత్రి పూట అయితే లారీలను తనిఖీ చేసే వారు కూడా ఉండరని వాటితో పంపించిన వే బిల్లులను రీ సైక్లింగ్ చేసి మరిన్ని లారీలను పంపించేందుకు స్కెచ్ వేసి ఉంటారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వే బిల్లుల్లో ఉన్న లారీ నంబర్లను కూడా పరిశీలించి ఇసుక తరలిపోతున్న లారీల నంబర్లను కూడా సరి చూసుకోవల్సిన అవసరం ఉందని అంటున్న వారూ లేకపోలేదు. అంతేకాకుండా ఇసుక రీచులో లారీల్లో లోడింగ్ అయిన వివరాలను రికార్డు చేసే రిజిస్టర్ కూడా ఉంటుందని వాటి ఆధారంగా కూడా విచారణ చేయాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రీచు రికార్డులు మెయింటైన్ చేయనట్టయితే దీని వెనక ఏదో గూడ్ పుటాని జరిగే అవకాశాలు ఉంటాయని స్థానికులు అంటున్నారు.
అర్థరాత్రి ఎలా..?
జైపూర్ మండలంలోని వేలాల ఇసుక రీచు నుండి తరలిపోతున్న లారీలను స్థానికులు, కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం సంచలనంగా మారింది. అయితే ఇసుక తరలించే లారీలు అర్థరాత్రి స్టాక్ యార్డు నుండి బయలుదేరడానికి కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. లారీలు అక్కడే పార్క్ చేసుకుని ఉన్నారని దానికి మేం బాధ్యత వహించలేమని రీచ్ నిర్వాహకులు చెప్తున్నట్టు సమాచారం. లారీల యజమానలు ఇసుక ఎప్పుడు గమ్యానికి చేరుతుందోనని ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో 20కి పైగా లారీలో వేలాల రీచు వద్దే పార్క్ చేసి ఎందుకు ఉంటారని స్థానికులు అంటున్నారు. రాత్రి వేళల్లో లోడింగ్ చేయవద్దన్న నిబంధనలు ఉన్నందున మైనింగ్, పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటారని తప్పుడు సమాచారం ఇస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
రణగోణ ధ్వనులు…
పగలు రాత్రి అని లేకుండా వేలాల రీచు నుండి ఇసుక లారీల రాకపోకలతో స్థానికులు ప్రత్యక్ష్య నరకం చూస్తున్నారు. అర్థరాత్రి కూడా లారీల హారన్ల మోతలు మారుమోగిపోతుండడంతో నిద్ర కూడా పోయే పరిస్థితి లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చదువుకు కూడా లారీలతో తీరని ఆటంకం ఎదురవుతోందని ఇసుక లారీల కోసం ప్రత్యేకంగా సమయం కెటాయించాలని స్థానికులు కోరుతున్నారు.