వారికి అంగరక్షకుల ఉప సంహరణ…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వీఐపీలు, టార్గెట్లకు రక్షణగా ఉండే గన్ మెన్ వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో నిమగ్నం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టార్గెట్లకు రక్షణగా నియమించిన అంగరక్షకులను తొలగించాలని నిర్ణయించారు.

టార్గెట్స్…

రాష్ట్రంలోని వివిధ రాజకీయ నాయకులకు రక్షణ కోసం నియమించిన గన్ మెన్లు వెనక్కి రావాలని సంబంధిత జిల్లాల పోలీసు అధికారుల నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రతిపక్ష, అధికార పార్టీల నాయకులకు అంగరక్షకులను రద్దు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు, పోలీసు విభాగానికి చెందిన టార్గెట్ ఆపీసర్లకు కెటాయించిన గన్ మెన్లు సంబంధిత కమిషనరేట్లు, జిల్లాల్లో రిపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న పోలీసు అధికారులు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేశారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి లాంటి వారికి కూడా గన్ మెన్లను రద్దు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ను నియమించినట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు నామినేటెడ్ పదవుల్లో కొనసాగిన వారికి కూడా సెక్యూరిటీని విత్ డ్రా చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ…

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రతిపక్ష పార్టీల నాయకుల రక్షణ కోసం నియమించిన గన్ మెన్ల వ్యవస్థను రద్దు చేశారు. దీంతో సదరు నాయకులు ఇంటలీజెన్స్ ఉన్నతాధికారులను కలిసి నక్సల్స్ టార్గెట్ అయిన తమకు కెటాయించిన గన్ మెన్లను రద్దు చేయడం సరికాదని, సెక్యూరిటీని పునరుద్దరించాలని అభ్యర్థించారు. ఆ తరువాత పోలీసు ఉన్నతాధికారులు రివ్యూ చేసి కొంతమంది నాయకులకు తిరిగి గన్ మెన్లను అలాట్ చేశారు.

మావోయిస్టులేరీ..?

ఇంతకాలం చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతానికి పరిమితమైన మావోయిస్టు పార్టీ ఎప్పుడైనా రాష్ట్రంలోకి వచ్చి టార్గెట్లను హతం చేసే ప్రమాదం ఉందని గన్ మెన్లను నియమించేవారు. టార్గెట్ అయిన పొలిటికల్, పోలీస్ అధికారులకు రక్షణ ఏర్పాటు చేయాలని, వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందని భావించారు. కానీ ప్రస్తుతం దేశంలోనే మావోయిస్టులు లేరని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కూడా మావోయిస్టుల ఉనికి లేకుండా పోయిందని, తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేతలంతా జనారణ్యంలోకి రావడంతో నక్సల్స్ కార్యకలాపాలకు పుల్ స్టాప్ పడిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనధికార నేతలకు, గతంలో టార్గెట్లయిన పోలీసు అధికారులకు కెటాయించిన అంగరక్షకుల వ్యవస్థను రద్దు చేయాలని భావించినట్టుగా తెలుస్తోంది. ఇందులో బాగంగానే వివిధ పార్టీల రాజకీయ నాయకులకు, టార్గెట్లకు అలాట్ చేసిన గన్ మెన్లను రద్దు చేస్తున్నట్టుగా సమాచారం.

GUNMENSmaoistsecurityTARGETSTG NEWS
Comments (0)
Add Comment