సీన్ రీ కన్సట్రక్షన్ తో మొబైల్, వెపన్స్ ట్రేస్…
దిశ దశ, కరీంనగర్:
కరుడుగట్టిన నేరస్తుల ముఠా… దోపిడీలు చేయడమే ప్రధాన వృత్తిగా పెట్టుకున్న గ్యాంగ్… బాస్ చెప్పినట్టుగా చేసే క్రిమినల్స్… దర్యాప్తు బృందాలను గందరగోళానికి గురిచేసే వ్యూహాల అమలు… దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరిన సుబోధ్ గ్యాంగ్ నుండి రాబరీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు కరీంనగర్ పోలీసులు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురిని కస్టడీకి నాలుగు రోజుల పాటు తీసుకున్న పోలీసులు కొంతమేర సమాచారాన్ని రాబట్టగలిగారు. మరింత కీలకమైన సమాచారం సేకరించాల్సి ఉన్నందున మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు.
మొబైల్ ట్రేస్…
కరీంనగర్ జ్యోతీనగర్ PMJ జువెలరీ షాప్ దోపిడీకి పాల్పడిన వారిలో ఇద్దరు దొంగలను ఇప్పటికే కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కస్టడీకి తీసుకున్న పోలీసులు సీన్ రీ కన్సట్రక్షన్ చేశారు. ఇందులో భాగంగా దోపిడీ ముఠా ప్రయాణించిన మార్గం గుండా తీసుకెళ్లారు. వారి దుస్తులు కెనాల్ లో పడేశామని చెప్పడంతో పాటు రెండో మొబైల్ కూడా కెనాల్ వద్దే విసిరేశామని చెప్పడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు దోపిడీ గ్యాంగును వెంట తీసుకుని ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పోలీసులు తిరిగారు. ఈ క్రమంలోనే ధర్మపురి సమీపంలోని మద్దునూర్ వద్ద కెనాల్ సమీపంలోని రాళ్ల మధ్య పడిపోయిన రెండో సెల్ ఫోన్ ను గాలించి మరీ పట్టుకున్నారు. అలాగే వెలిచాల క్రాసింగ్ వద్ద దాచి పెట్టిన రెండు తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
మరో ఇద్దరు…
ఇప్పటి వరకు దోపిడీలో ప్రత్యక్ష్యంగా పాల్గొన్న ఇధ్దరు నిందితులు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరా సింగ్ (41), రవిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమ్నన్ (23)లను అరెస్ట్ చేయగా ఈ కేసులో A10 నిందితునిగా ఉన్న అమర్ సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ అమరేంద్ర సింగ్ (43)ను బిహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లా సలీంపూరాలో అరెస్ట్ చేసి అక్కడి కోర్టులో హాజరు పరిచారు. కరీంనగర్ పోలీసులు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కరీంనగర్ కు తీసుకవస్తోంది కరీంనగర్ నుండి వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం. పహిల్వాన్ దోపిడీకి పాల్పడిన నిందితులకు డబ్బులు చేరవేసే డ్యూటీ చేస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. మే 3న కరీంనగర్ PMJ జువెలరీ షాప్ దోపిడీ ఘటనకు పాల్పడిన వారికి రూ. లక్ష ఇచ్చేందుకు పశ్చిమ బెంగాల్ కు వెళ్లి అప్పగించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు మరో నిందితున్ని కూడా పోలీసులు పట్టుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. అతన్ని కూడా కరీంనగర్ కు తరలించే పనిలో నిమగ్నం అయింది కరీంనగర్ స్పెషల్ టీమ్. 13 మందిపై నమోదయిన ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయడం విశేషం.
నిరాకరణ…
అయితే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో ఎత్తుకెళ్లిన నగల గురించి మాత్ర పోలీసుల విచారణలో నిందితులు చెప్పలేదు. పోలీసులను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించినట్టుగా తెలిసింది. అభరణాలు ఎక్కడ దాచారు..? ఎవరికి అప్పగించారు అన్న విషయంపై నిందితులు స్పష్టత ఇవ్వడం లేదు. మొదటూ గుండాల అటవీ ప్రాంతంలో దాచిపెట్టామని చెప్పిన నిందితులు ఆ తరువాత వేరే ప్రాంతంలో దాచామని చెప్పి మిస్ గైడ్ చేశారు. పోలీసులను కావాలనే తప్పదారి పట్టిస్తున్నారని గమనించిన పోలీసులు వీరిని మళ్లీ విచారించాల్సి ఉందని నిర్ణయించారు.
షిప్ట్ సిస్టం…
పట్టువదలని విక్రమార్కుళ్లలా వ్యవహరిస్తున్నారు కరీంనగర్ పోలీసులు. రాబరీ కేసులో ప్రధాన సూత్ర ధారి అయిన సుబోధ్ సింగ్, దోపిడీలో పాల్గొన్న మరో ఇద్దరిని, వీరికి సిమ్ కార్డు విక్రయించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా నిందితుల కుటుంబాలకు డబ్బులు అందించిన పహిల్వాన్ అనే మరో అతన్ని అరెస్ట్ చేశారు. పహిల్వాన్ ను కరీంనగర్ తరలించేందుకు ఓ పోలీసు బృందం కరీంనగర్ వస్తున్న క్రమంలోనే బిహార్ లోనే షెల్టర్ తీసుకున్న ఇక్కడి పోలీసులు మరో నిందితున్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ముఠాకు చెందిన మొత్తం 13 మందిని అరెస్ట్ చేయాల్సిందేనని, ఎత్తుకెళ్లిన నగలను రికవరీ చేయాల్సిందేనని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం నిర్ణయించారు. ఇందు కోసం బిహార్ రాష్ట్రంలో కరీంనగర్ పోలీసు బృందాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించే విధంగా ప్లాన్ చేశారు. అయితే బిహార్ నుండి ఒక టీమ్ కరీంనగర్ తిరుగు ప్రయాణం అవుతున్నట్టయితే మరో టీమ్ ను అక్కడికి పంపిస్తున్నారు. ముఠాను అదుపులోకి తీసుకునే వరకు కూడా షిఫ్ట్ పద్దతిని అమలు చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.