కరీంనగర్ లో ఉద్రిక్తత…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రంలో అధికారం బీజేపీ వర్సెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల నాయకుల చర్యలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల నేపథ్యంలో రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ కరీంనగర్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జ్యోతినగర్ లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ బండి సంజయ్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్ ఎంపీ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడ్డుకునేందుకు అప్పటికే పోలీసులు మోహరించగా, ఆఫీసు గేట్ క్లోజ్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు గేట్ వద్దకు చేరుకున్న క్రమంలో ఎంపీ కార్యాలయంలో ఉన్న బీజేపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. కర్రలు, కుర్చీలను ఉపయోగించడంతో పాటు చెప్పులు కూడా తీసి చూపించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం ప్రదర్శించడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు.
అధికార పార్టీ నేతల అరెస్ట్…
గాంధీ విగ్రహం వద్ద నిరసన అనంతరం ఎంపీ కార్యాలయం ముట్టడికి బయలు దేరిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోర్టు చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, సుడా మాజీ ఛైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ ఇంఛార్జ్ వెలిచాల రాజేందర్ రావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపున ఎంపీ కార్యాలయం వద్ద లోకసభ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీతో అమితుమీకి సిద్దమని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీతో పోటీ పడుతున్నారని కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హుందాతనంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తాము కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.
అలెర్ట్…
కరీంనగర్ లో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న పరిణామాల నేఫథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎంపీ బండి సంజయ్ ఆఫీసు, డీసీసీ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా బలగాలను మోహరించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.