అంతటా అలా…. ఇక్కడ మాత్రం ఇలా…

చివరకు ప్రాణం తీసుకున్న పరిస్థితి…

కాంగ్రెస్ పార్టీ నాయకులపై క్రిమినల్ కేసులు…

దిశ దశ, కరీంనగర్:

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆందోళనలు వ్యక్తం అవుతుంటే అక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులపైనే కేసు నమోదు అయింది. సొంత పార్టీ నాయకులే తనపై అక్రమ కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అధికార పార్టీ నాయకుడు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. తన భర్త మరణానికి కారణమైన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని సమత ఫిర్యాదు చేయడంతో పలువురు కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యం తాగేందుకు వచ్చి…

మృతుడు రాజేందర్ రెడ్డి భార్య సమత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు… ఈ నెల 13న గన్నేరువరం మండల కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ రెడ్డి షాపు వద్దకు చేరుకున్న కొంతమంది మద్యం తాగుతున్నారు. అప్పుడే బయట నుండి వచ్చిన ఆయన తన షాపులో తాగడం ఏంటని వారిని నిలదీశాడు. దీంతో షాపు వద్ద మద్యం తాగుతున్న వారు నిన్ను చంపేందుకు ఇక్కడకు వచ్చాం అంటూ గొడవకు దిగారు. అయితే వారిని వారిస్తున్న క్రమంలో రాజేందర్ రెడ్డి చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని పగలగొట్టారు. దీంతో రాజేందర్ రెడ్డి తన మొబైల్ ఫోన్ ఎందుకు పగలగొట్టారని వారిని ప్రశ్నించాడు. షాపునకు కొద్ది దూరంలో ఉన్న మహ్మద్ సాదిక్ అక్కడకు చేరుకుని మొబైల్ ఫోన్ రేపు ఉదయం కొని ఇప్పిస్తానని రాజేందర్ రెడ్డికి చెప్పి వెళ్లిపోయాడు. మరునాడు మొబైల్ ఫోన్ కొనివ్వకుండా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ వంగల మురళీధర్ రెడ్డి అనుచరులైన మల్లేశం, శ్రావణ్ లచే గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. దీంతో మనస్థాపానికి గురైన రాజేందర్ రెడ్డి ఈ నెల 14న ఎల్ఎండీలోని మానకొండూరు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన రాజేందర్ రెడ్డిని కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన తరువాత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రాజేందర్ రెడ్డి బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఆసుపత్రిలో కన్నుమూశాడు. దీంతో గురువారం ఉదయం కరీంనగర్ సివిల్ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టగా కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తో పాటు పలువురు పోలీసు అధికారులు అక్కడకు చేరుకున్నారు. రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో చర్చించిన పోలీసు అధికారులు స్పాట్ ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే కవ్వంపల్లి పీఏ వంగల మురళీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహ్మద్ సాదిక్, వంగల రవిందర్ రెడ్డి, పైడిమల్ల మల్లేశం, బొగ్గుల శ్రావణ్ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లలో నమోదయిన ఈ కేసులో వీరిని వెంటనే అరెస్ట్ చేయాలని రాజేందర్ రెడ్డి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

వ్యూహమా..?

ఈ నెల 13వ తేదిన రాజేందర్ రెడ్డి షాపు వద్దకు వెళ్లిన వారు అతన్ని కేసులో ఇరికించే కుట్రలో భాగంగానే అక్కడకు చేరుకున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. కావాలనే గొడవకు దిగి అతన్ని కేసులో ఇరికించాలని పథకం వేసుకుని వచ్చారని అతని భార్య సమత కూడా ఆరోపిస్తోంది. ఈ లెక్కన చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టయితే రాజేందర్ రెడ్డి జైలు పాలవుతాడని భావించి ఉంటారని అంటున్నవారూ లేకపోలేదు. ఈ నెల 13వ తేదిన తన భర్త షాపు వద్దకు వచ్చిన వారిని మురళీధర్ రెడ్డే పంపించాడని సమత ఆరోపిస్తున్నారు. కావాలనే రాజేందర్ రెడ్డిని కొట్టి మొబైల్ ఫోన్ పగలగొట్టి మరునాడు తన భర్తపైనే తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు.

crimekarimnagarkavvampally sathynarayan mlamanakondur mlaTG NEWS
Comments (0)
Add Comment