ఎంపీ వంశీకృష్ణ తీరుపై అసహనం…
పీఎస్సార్ లేకుంటే నీకు ప్రచారం చేసేవాళ్లం కాదు….
పార్టీలు మారిన చరిత్ర మీది… కాంగ్రెస్ కే కాకా జీవితం అంకితం…
దిశ దశ, మంచిర్యాల:
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణపై కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే అనుభందం పెనవేసుకుని చివరి వరకూ అదే పార్టీలో కొనసాగిన కాక వెంకటస్వామి ఆదర్శ ప్రాయమైన జీవనం సాగించాడని, మీరు మాత్రం మూడు పార్టీలు మారి ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేశారని మండి పడ్డారు. బుధవారం మంచిర్యాల జిల్లా దండెపల్లిలో దళిత కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పినందుకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన వంశీ కృష్ణకు అండగా నిలిచి అత్యధిక మెజారిటీ వచ్చేందుకు కృషి చేశామన్నారు. అయితే వంశీ కృష్ణ మాత్రం దళితులను వర్గాలుగా విభజించారని, ఆయనకు ఓటు వేయని వారిని అక్కున చేర్చుకుని తమను విస్మరిస్తున్నాడని మండిపడ్డారు. గూడెంలో స్కూల్ విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేసే కార్యక్రమానికి వచ్చిన ఎంపీని కలిసేందుకు తాము వెలితే పోలీసులచే తమను వెల్లగొట్టించాడని, తమను తీవ్రంగా అవమాన పర్చాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి మూడు పార్టీలు మారినా మీ కుటుంబాన్ని మళ్లీ అక్కున చేర్చుకున్నదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని దళిత సంఘాల నాయకులు సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులను తన వెంట పెట్టుకుని ఎంపీ తిరుగుతున్న తీరు సరైంది కాదని వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, కష్ట కాలంలో పార్టీ శ్రేణులను కాపాడుకున్న చరిత్ర ఆయనదన్నారు. తాము ఎప్పిటికైనా ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలోనే పని చేస్తామని, ఎంపీ కూడా అందరిని కలుపుకపోయే విధంగా నడుచుకోవల్సిన అవసరం ఉందన్నారు.