దిశ దశ, హైదరాబాద్:
రైతుల నుండి సేకరించిన మక్కల అమ్మకం విషయంలో తెలంగాణ మార్క్ ఫెడ్ అధికారులు మీనామేషాలు లెక్కిస్తున్నారు. ఓ సారి టెండర్ ద్వారా విక్రయించిన అధికారులు మిగతా నిలువలను విక్రయించేందుకు ఆలస్యం చేయడానికి కారణమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మక్కలు కొనుగోలు చేసిన మార్క్ ఫెడ్ ఇటీవల 3.83 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను టెండర్ ద్వారా విక్రయించింది. మిగతా మక్కలు విక్రయించేందుకు టెండర్ ప్రక్రియ కొనసాగించే విషయంలో దృష్టి సారించడం లేదు. రైతుల నుండి రూ. 2400 క్వింటాలుకు కొనుగోలు చేసిన మార్క్ ఫెడ్ రూ. 2200 క్వింటాలుకు విక్రయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేసిన మార్క్ ఫెడ్ మిగతా 12.17 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను స్టాక్ యార్డులకే పరిమితం చేసింది. దీంతో అటు గోదాముల అద్దె, ఇటు బ్యాంకు లోన్లకు సంబంధించిన వడ్డీతో ఆర్థిక భారం మార్క్ ఫెడ్ పై పడనుంది. రైతుల నుండి కొనుగోలు చేసిన మక్కలను వ్యాపారులకు విక్రయించినట్టయితే సంస్థపై పడే ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ టెండర్లకు పిలవకుండా కాలయాపన చేయడానికి కారణమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన మక్కలను వెంటనే విక్రయించినట్టయితే కొంతలో కొంత అయినా ఆర్థిక భారం తగ్గే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. మార్కెట్ లో డిమాండ్ కు అనుగుణంగా మక్కలు విక్రయించాలని భావించినట్టయితే మొదటి సారి కూడా టెండర్లకు పిలవకుండా ఉండేవారని, రెండో సారి బిడ్డర్లను పిలిచే విషయంలో మాత్రం ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల నుండి కొనుగోలు చేసిన దానికంటే క్వింటాలుకు రూ. 200 తక్కువగా మొదటి సారి బిడ్ల ద్వారా అమ్మిన మార్క్ ఫెడ్ లోడింగ్, అన్ లోడింగ్, రవాణా, గోదాముల రెంట్ తదితర ఖర్చులు భరించింది. మిగతా మక్కలను కూడా సకాలంలో విక్రయించినట్టయితే బ్యాంకు రుణాల వడ్డీ భారం తగ్గడంతో పాటు సకాలంలో రైతులకు కూడా డబ్బులు చెల్లించే అవకాశం ఉంటుంది. దీనివల్ల సంస్థపై పడే ఆర్థిక భారం తగ్గడంతో పాటు రైతుల చేతికి కూడా డబ్బులు చేరే అవకాశం ఉంటుంది. కొద్ది రోజులుగా వ్యాపారులు మక్కల టెండర్లకు ఆహ్వానించే విషయంలో మార్క్ ఫెడ్ అధికారులను అడిగితే నేడు రేపు అంటూ వాయిదాలు వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మార్క్ ఫెడ్ సేకరించిన మక్కలను సకాలంలో విక్రయించినట్టయితే అవి డ్యామేజ్ కాకుండా ఉంటాయని, ఇలాగే కాలయాపన చేస్తే నాణ్యత లేకుండా పోయిన మక్కలకు ధర కూడా తగ్గే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీంతో సంస్థపై మరింత ఆర్థిక భారం పడడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మార్క్ ఫెడ్ అధికారులు మిగతా మక్కలను విక్రయించేందుకు సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.