సీసీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు…
రంగంలోకి దిగిన పోలీస్ టీమ్స్
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ భగత్ నగర్ లోని ఓ ఇంట్లో దోపిడీకి పాల్పడిన ముఠా రైలెక్కి ఉత్తరాదికి పరార్ అయిందా లేక ఇక్కడే ఉందా అన్న విషయం తేలాల్సి ఉంది. మంగళవారం అర్థరాత్రి దోపిడీకి పాల్పడిన తరువాత రెండు బైకులను కూడా ఎత్తుకెళ్లిన ముఠా సభ్యులు ఐదుగురు కరీంనగర్ నుండి వరంగల్ వైపునకు వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్ లోని ఓ బంక్ లో పెట్రోల్ పోయించుకున్న తరువాత వరంగల్ వైపునకు వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు. హుజురాబాద్ పట్టణం మీదుగా వీరు వెళ్లిపోతున్నట్టుగా సీసీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో వరంగల్, ఖాజీపేట తదితర ప్రాంతాల్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే అజ్మత్ అలీ ఇంట్లో నగలు, నగదు ఎక్కడ ఉన్నాయో డైరక్ట్ గా అక్కడికే దోపిడీ ముఠా వెళ్లడంతో పక్కాగా అతని అల్లుని ప్రోద్భలంతోనే జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన ఆయన ఆ ప్రాంతానికి చెందిన దోపిడీ ముఠాను ఇక్కడకు పంపించి ఉంటాడని అనుకుంటున్నారు.
ఐదుగురేనా..?
అయితే తమ ఇంట్లో దోపీడి చేసేందుకు వచ్చింది ఆరు నుండి ఎనిమిది మంది వరకూ ఉంటారని అజ్మత్ అలీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్న రెండు బైకులపై ఐదుగురు వ్యక్తులు మాత్రమే ఉన్నట్టుగా సీసీ కెమెరాలో రికార్డు అయింది. మొదటి బైకుపై ఇద్దరు ఉండగా నేరుగా పెట్రోల్ బంక్ లోకి వెళ్లగా రెండో బైకుపై ముగ్గురు ఉండగా ఇద్దరు రోడ్డపై దిగిన తరువాత పెట్రోల్ బంకులోపలకు వెళ్లినట్టుగా కనిపిస్తోంది. ఒక వేళ ఆరు నుండి ఎనిమిది మంది ఈ దోపిడీలో పాల్గొన్నట్టయితే మిగతా వారు ఎలా తప్పించుకుని వెళ్లారన్నది కూడా తేలాల్సి ఉంది. పెట్రోల్ బంక్ లోకి మొదట వెళ్లిన బైకుపై ఉన్న అగంతకులు రూ. 500 ఇచ్చి తన బైకులో రూ. 250 పెట్రోల్, రెండో బైకులో మిగతా పెట్రోల్ పోయాలని చెప్పాడు. అయితే రెండో బైక్ ట్యాంక్ ఓపెన్ చేసేందుకు తాళం చెవి లేకపోవడంతో పెట్రోల్ పోయించుకోకుండానే వెళ్లిపోయారు. అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది డబ్బులు తీసుకెళ్లాలని అరిచినా వినిపించుకోకుండా పరార్ అయినట్టుగా తెలుస్తోంది.
బైకులు…
కరీంనగర్ పోలీసులు బైకుల ఆచూకి కోసం ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితులను వెతుకుతున్న క్రమంలో హుజురాబాద్ సమీపంలోని పెద్ద పాపయ్యపల్లి వద్ద రెండు బైకులను పడేసిన దోపిడీ ముఠా అక్కడి నుండి తప్పించుకుని వెళ్లిపోయినట్టుగా సమాచారం.
అక్కడి నుండి..?
పెద్దపాపయ్య పల్లి స్టేజ్ నుండి అగంతకులు ఎటు వైపు వెళ్లారు..? ఎలా వెళ్లారు అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హైవే కావడంతో లారీల్లో ఎక్కి వెళ్లి ఉంటారన్న కోణంలో ఆరా తీస్తున్నప్పటికీ అర్థరాత్రి వేళ అంతమందిని చూసి డ్రైవర్లు లారీని నిలిపే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అగంతకులు ప్రయాణించిన వాహనం పెద్దపాపయ్యపల్లికి చేరుకున్న తరువాత బైకులను అక్కడే పడేసి ఎందులో వెళ్లిపోయి ఉంటారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. లేనట్టయితే మరో బైకులో పెట్రోల్ పోయనందున అక్కడే ఆగిపోవడంతో వాటిని అక్కడే వదిలేశారా అన్నది తేలాల్సి ఉంది. ప్రధానంగా దోపిడీ గ్యాంగ్ కరీంనగర్ భగత్ నగర్ కు ఎలా చేరుకుంది..? అజ్మత్ అలీ ఇంట్లోకి చేరుకునే వరకు ఎలా వచ్చారు అన్న విషయంపై క్లారీటీ రావడం లేదు. కాలినడకన వచ్చారా లేక వాహనంలో వచ్చి ఆ ఇంటి సమీపంలో దిగి లోపలకు చొరబడ్డారా అన్న విషయం తెలియరావడం లేదు. ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పని చేయకపోవడం వల్ల ఫుటేజ్ లభ్యం కానట్టుగా సమాచారం. అయితే దోపిడీకి పాల్పడిన తరువాత ముఠా బృందావన్ ఫంక్షన్ హాల్ మీదుగా పెద్దమ్మగుడి ముందు నుండి సిరిసిల్ల బైపాస్ కు చేరుకుని అక్కడే ఉన్న బంకులో పెట్రోల్ కోసం వెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు.
పీఎంజే…
మే 3న కరీంనగర్ జ్యోతీనగర్ పీఎంజే నగల షాపులో సుబోధ్ గ్యాంగ్ రాబరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల క్రితం వరకు కరీంనగర్ లోనే ఉన్న అజ్మత్ అలీ అల్లుడు పీఎంజే షాపు రాబరీ గురించి విని అదే తరహాలోనే తన మామ ఇంటిలో దోపిడీ చేయించి ఉంటాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందు కోసం ఉత్తర భారతదేశానికి చెందిన ముఠాను పంపించినట్టయితే పోలీసులకు సకాలంలో చిక్కే అవకాశం ఉండదని భావించి ఉంటాడన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
పెట్రోలింగ్..?
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపు రాబరీ తరువాత కరీంనగర్ పోలీసులు హై అలెర్ట్ అయ్యారు లాడ్జిలతో పాటు రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అయినప్పటికీ భగత్ నగర్ లోని అజ్మత్ అలీ ఇంట్లో దోపిడీ జరగడం సంచలనంగా మారింది. రాత్రి వేళల్లో గస్తీ చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను నియమించినప్పటికీ రాబరీ జరగడం గమనార్హం. రాత్రి వేళల్లో నగరమంతా గస్తీ చేపట్టేందుకు ప్రత్యేకంగా నైట్ రూట్ ఆఫీసర్ (NRO), నైట్ డ్యూటీ ఆఫీసర్ (NDO), నైట్ సూపర్ వైజింగ్ ఆపీసర్ (NSO)లతో పాటు పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నా మారణాయుధాలు తీసుకొచ్చి మరీ దర్జాగా దోపిడీ చేసుకుని వెళ్లిన తీరు అంతు చిక్కకుండా పోతోంది. ప్రధాన రహదారులే కాకుండా చిన్న వీధుల్లో కూడా రాత్రి వేళల్లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నా దోపిడీ ముఠా తమ పనిని సాఫీగా చేసుకుని పోవడం సవాల్ గా మారింది.