దిశ దశ, భూపాలపల్లి:
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోందని, బ్యారేజీల డిజైన్లలో లోపాలను సవరించే బాధ్యతలను నిపుణులకు అప్పగించిందని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పునరుద్దరణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… KLIS బ్యారేజీల డిజైన్ల లోపాలను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షలు జులై మొదటి వారంలోగా పూర్తి కానున్నాయని ప్రకటించారు. వర్షాకాలం సీజన్ ముగిసిన తరువాత నవంబర్ లేదా డిసెంబర్ నెలలో మరమ్మత్తులు ప్రారంభించి వచ్చే ఏడాది వేసవి కాలం వరకు బ్యారేజీలను సిద్దం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జలసంబంధిత అధ్యయనాలు, GPR పరీక్షలు, జియోటెక్నికల్ బోర్‌హోల్ అధ్యయనాలు, సాంకేతికంగా ఎదురవుదున్న సమస్యలను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని, ప్రాథమిక దశ పరీక్షల్లో చాలా వరకూ పూర్తయ్యాయని, మిగిలినవి జూన్ లేదా జులై నాటికి పూర్తి కావాలని ఇంజనీర్లను ఆదేశించారు. అధ్యయనాల ద్వారా గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి కేంద్ర జల సంఘం (Central Water Commission), జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ (National Dam Safety Authority)లకు పంపించిన బ్యారేజీలను పునరుద్దరించేందుకు తీసుకోవల్సిన చర్యలపై నివేదికలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 2023 అక్టోబర్ నెలలో మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన సమస్య కారణంగా NDSA సూచన మేరకు అదే సంవత్సరం డిసెంబర్ 7 నుండి నీటిని నిలువ ఉంచడం లేదన్నారు. కేంద్ర సంస్థల ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పర్యటించి బ్యారేజీలలోని లోపాలను గుర్తించాయాని వాటిని అధిగమించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతుందన్నారు. బ్యారేజీలను పునరుద్దరించేందుకు ముంబాయి ఐఐటీ నిపుణుల భాగస్వామ్యంలో అంతర్జాతీయ డిజైన్ కన్సల్టెంట్ AFRYకి బాధ్యతలు అప్పగించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ప్రతినిధులు నమూనా అధ్యయనాలు, సాంకేతిక పరిశోధనలు నిర్వహిస్తోందని, ఇందుకు జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సహకారం కూడా తీసుకున్నామన్నారు. బ్యారేజీలను పునరుద్దరించి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అనుభవజ్ఞుడైన అధికారి కల్నల్ పరిక్షిత్ మెహ్రాను పునరుద్ధరణ సమన్వయ బృందం ఛైర్మన్‌గా నియమించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు పునరుద్దరణ పనులు CWC, NDSA ఆమోదంతోనే చేపడతామని, బ్యారేజీలు సుదీర్ఘ కాలం నీటిని స్టోర్ చేసే విధంగా పటిష్టంగా పనులు చేపడుతున్నామన్నారు. కాళేశ్వరం బ్యారేజీలలో కోత లోతు, కట్-ఆఫ్ లోతు, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, భౌతిక నమూనా అధ్యయనాలు, గేట్ల నిర్మాణంలో లోపాలు తదితర ప్రధాన సమస్యలను జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ ఎత్తి చూపిందన్నారు. మూడు బ్యారేజీల వద్ద GPR పరీక్షలు దాదాపు 80 నుండి 90 శాతం పూర్తి కాగా, బోర్‌హోల్, జియోటెక్నికల్ పరిశీలనలు 75 నుండి 80 శాతం పూర్తయ్యాయని మంత్రి వివరించారు. ఈ పరీక్షలు జూన్ నెలాఖరు వరకూ పూర్తవుతాయని భావిస్తున్నామన్నారు. భూమి లోతులో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కొన్ని బోర్‌హోళ్లను 40 నుండి 80 మీటర్ల లోతు వరకు వేశారని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ కార్యదర్శి ఈ శ్రీధర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.