ఒక్కొక్కరిని పట్టుకుంటున్న పోలీసులు
దిశ దశ, కరీంగనర్:
గోల్డ్ థీఫ్ సుబోధ్ గ్యాంగ్ చుట్టూ పోలీసుల ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది. భారీ నెట్ వర్క్ ద్వారా దర్యాప్తును తప్పుదారి పట్టించవచ్చని వేసుకున్న అంచనాలు తలకిందులు అవుతున్నట్టుగా ఉంది. తెలంగాణాలో తొలిసారి దోపిడీ చేసిన సుబోధ్ గ్యాంగ్ ఇప్పుడు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురయింది. ఇతర రాష్ట్రాలలో పోలీసులు సుబోధ్ ను రాబరీ కేసులో ఫిక్స్ చేయడంలో విఫలం కాగా కరీంనగర్ పోలీసులు మాత్రం సక్సెస్ అయ్యారు. జ్యువెలరీ షాపు దోపిడీలో సుబోద్ కుమార్ సింగ్ అలియాస్ బాబువాను A1 నిందితునిగా చేర్చారు. అయితే ఈ కేసు విషయంలో పోలీసులు కేవలం ఘటనకు పాల్పడిన వారిపై మాత్రమే కేసు పెడ్తారని అనుకున్నప్పటికీ ముఠా లోతుపాతులను తెలుసుకోవడంలో కరీంగనర్ పోలీసులు సక్సెస్ అయ్యారు. బీహార్, పశ్చిమబెంగాల్ వరకూ కరీంనగర్ పోలీసు బృందాలు చేరుకుని దోపిడీలో ప్రత్యక్ష్యంగా పాల్గొన్న వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో కేసు కీలక మలుపు తిరిగినట్టయింది. ఈ రాబరీలో ఇప్పటి వరకు మొత్తం 13 మంది ప్రమేయం ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉన్నట్టుగా పోలీసులు తేల్చారు. రాబరీలో పాత్రధారులు ఎంతమంది అన్న విషయం గురించి గతంలో జరిగిన దోపిడీ విషయంపై అక్కడి పోలీసులు దృష్టి సారించలేకపోవడం వల్లే ఇంతకాలం సుబోధ్ గ్యాంగ్ ఆటలు కొనసాగినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే కరీంనగర్ పోలీసులు కేసు పూర్వాపరాలు, నిందితుల సంబంధాలపై సమగ్రంగా ఆరా తీయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దోపిడీకి పాల్పడిన వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురి కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నారు. నేరాలకు పాల్పడిన తరువాత బీహార్, పశ్చిమ బెంగాల్, నేపాల్ తదితర ప్రాంతాలకు వెళ్లి షెల్టర్ తీసుకోవడం కొంతకాలానికి తిరిగి చేరుకోవడం వీరికి పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినా నేరాల వెనక ఉన్న కోణాలను వెలికి తీసేందుకు సాహసించలేదు. కానీ కరీంనగర్ పోలీసులు మాత్రం విస్తరించిన నేర సామ్రాజ్యం గురించి ట్రేస్ చేయడంతో వారి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా తయారైంది. 13 మందిలో ఆరుగురిని అరెస్ట్ చేయడంలో సక్సెస్ అయిన కరీంనగర్ పోలీసులు మిగతా వారిని పట్టుకుని తీరుతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. జ్యువెలరీలో కాల్పులు జరిపిన రెండు తుపాకులను, ధర్మపురి సమీపంలో పడేసిన మరో మొబైల్ ను కూడా రికవరీ చేశారు. అయితే రెండు మొబైల్ ఫోన్లను రిట్రైవ్ చేసి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మరో వైపున పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న రాబరీకి పాల్పడిన మరో ముగ్గురు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. వారి కోసం స్పెషల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని మరీ ఆరా తీస్తున్నారు. వారి ఆచూకి లభ్యం అయినట్టయితే సుబోధ్ గ్యాంగ్ డాటా మొత్తం చిక్కుతుందని అనుకుంటున్నారు.
రాజస్థాన్ నంబర్…
ఒక్క నేరాలకు పాల్పడిన చైన్ పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు విస్తృతమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న సుబోధ్ గ్యాంగ్ టీమ్ మెంబర్స్ ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోన్ నంబర్లు వాడుతుంటారని తెలుస్తోంది. బీహార్, పశ్చిమబెంగాల్ కు చెందిన ఈ ముఠాలో ఒకరు రాజస్తాన్ రాష్ట్రానికి అలాట్ అయిన మొబైల్ నంబర్ వాడారు. అయితే నిందితులు మాత్రం బీహర్, పశ్చిమ బెంగాల్ కు చెందిన వారేనని తేలడంతో పోలీసులు ఆ దిశగా ఆరా తీసే పనిలో నిమగ్నమై సక్సెస్ అయ్యారు. ఈ లెక్కన సుబోధ్ గ్యాంగ్ రాబరీలకు పాల్పడేందుకు భారీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాలకు సంబంధించిన సిమ్ కార్డులు వినియోగిస్తుందని స్పష్టం అవుతోంది. పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆరా తీసినా అందుకు సంబంధించిన డాటా పోలీసులకు సకాలంలో లభ్యం కాదని దీంతో తాము దోపిడీ చేసిన నగలను నగదుగా మార్చుకోగలుగుతామని కూడా అంచనా వేసి ఉంటుందని తెలుస్తోంది. చాలా మందిని దోపీడీల్లో ఇన్ వాల్వ్ చేయడం వల్ల కూడా పోలీసుల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని గమనించి ఉంటారని స్పష్టం అవుతోంది. కరీంనగర్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించినప్పుడు కూడా పోలీసులను మిస్ గైడ్ చేసే విధంగా నడుచుకున్నారు. నగలను దాచిపెట్టిన ప్రాంతం గురించి వేర్వేరు ప్రాంతాల పేర్లు చెప్పారని పోలీసులు చెప్తున్నారు. ఇలా ప్రతి విషయంలో పోలీసులను తప్పుదారి పట్టించేందుకు పథకం రచించుకునే దోపిడీ ముఠా నేరాలకు పాల్పడుతోందని అర్థం అవుతోంది.