మిస్ గైడ్ చేయడానికి కారణమేంటీ..?

 

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ డంపింగ్ యార్డులో బయో మైనింగ్ కోసం కాంట్రాక్టు తీసుకున్న జానేశ్వర ఇంజనీరింగ్ ఏజెన్సీ వాస్తవాలను ఎందుకు మరుగున పెడుతోంది..? అటు పోలీసులను, ఇటు మునిసిపలిటిని మిస్ గైడ్ చేయడానికి కారణమేంటీ..? అసలు బయోమైనింగ్ మిషనరీ చేసిన పనికి… ఎత్తిన బిల్లులకు, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుకు పొంతన లేకుండా ఉండడమేంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ‘‘దిశ దశ’’కు అందిన కీలక ఆధారాలను పరిశీలిస్తే ఈ వ్యవహారంలో అసలు లోగుట్టు ఏదో దాగి ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిల్లులు మంజూరు చేయడంలో వెనకా ముందు చూసుకోకుండా బల్దియా అధికారులు వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు దారి తీస్తోంది.

రీడింగ్ ఇలా…

జానేశ్వర ఇంజనీరింగ్ ఏజెన్సీ కరీంనగర్ డంపింగ్ యార్డులో బయోమైనింగ్ కోసం అద్దెకు తీసుకొచ్చిన టెరెక్స్ హైబ్రిడ్ వారియర్ – 1200 మిషన్ ను ఉపయోగించింది. గత జనవరి 24 నుండి ఏప్రిల్ 7 వరకు చెత్తను మిషన్ ప్రాసెస్ చేశామని కేవలం 156 గంటలే పని చేసిందని ఏజెన్సీ నిర్వాహాకుడు జాన్ సైదా కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆయన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. అయితే మిషనరీలో నమోదైన రీడింగ్ ఆధారాలు కానీ, మునిసిపల్ అధికారులు ఇచ్చిన బిల్లుల వివరాలను కానీ పోలీసులు పరిశీలించలేనట్టుగా స్పష్టం అవుతోంది. అన్నింటిని పరిశీలించినట్టయితే తప్పుడు ఫిర్యాదుగా భావించి కేసు నమోదు చేయకుండా ఉండేవారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  వాస్తవంగా జాన్ సైదాకు వివేక్ రెడ్డి అనే వ్యక్తి టెరెక్స్ మిషన్ ను అద్దెకు ఇచ్చారు. ఈ మిషన్ ఆల్ వన్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, పటియాల పంజాబ్ కు చెందినది కాగా వివేక్ రెడ్డి ఆ సంస్థ వద్ద అద్దెకు తీసుకుని జానేశ్వర ఇంజనీరింగ్ ఏజెన్సీకి అద్దెకు ఇచ్చాడు. అయితే ఈ మిషనరీ  కేవలం 156 గంటలే పని చేసినట్టయితే అంతకు మించి బిల్లులు మంజూరు చేయడం అనుమానాలకు తావిస్తోంది. మునిసిపాలిటీలో పని చేస్తున్న ఒకరిద్దరు అధికారులు ఆ ఏజెన్సీతో సాన్నిహిత్యం కలిగి ఉండడం వల్లే చకా చకా బిల్లులు డ్రా అయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏప్రిల్ 4న కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు జాన్ సైదా ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి కేసు నమోదు అయింది. ఇదే రోజున మిషన్ ఆపరేటర్ పై జానేశ్వర్ ఇంజనీరింగ్ ఏజెన్సీ వారు దాడి చేశారని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు అయింది. మిషనరీ తీసుకెళ్లేందుకు పటియాలకు చెందిన కంపెనీ ప్రతినిధులు కరీంనగర్ డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకున్న క్రమంలో కేసుల పరంపర మొదలైంది. ఇందులో వివేక్ రెడ్డిపై కాంట్రాక్ట్ ఏజెన్సీ, మిషన్ అద్దెకు ఇచ్చిన కంపెనీ ప్రతినిధులు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. అయితే ఏప్రిల్ 4 వరకు కేవలం 156 గంటలు మాత్రమే ఈ మిషనరీ పని చేసినట్టుగా పోలీసులకు జాన్ సైదా పేర్కొన్నారు. దాదాపు ఈ నెల 13వ తేదిన పటియాలకు చెందిన కంపెనీ ప్రతినిధులు కరీంనగర్ డంపింగ్ యార్డు నుండి మిషన్ ను తీసుకెళ్లారు. అప్పుడు మిషనరీలో నమోదయిన రీడింగ్ పరిశీలించగా దాదాపు 380 గంటల వరకూ పని చేసినట్టుగా స్పష్టం అవుతోంది.  ఒక వేళ పోలీసులకు ఫిర్యాదు చేపిన తరువాత కూడా ఈ మిషనరీ ద్వారా చెత్త ప్రాసెస్ చేసినట్టయితే ఆపరేటర్ గా పని చేస్తున్న వ్యక్తి అందుబాటులో లేకున్నా ఎలా పని చేయించుకున్నారన్నదే అర్థం కాకుండా పోతోంది. అంతేకాకుండా మిషన్ కీని కూడా పటియాల కంపెనీ ప్రతినిదులు తీసుకెళ్లినట్టుగా సమాచారం. అలాంటప్పుడు డంపింగ్ యార్డులో ప్రాసెసింగ్ ఎలా చేశారోనన్న ప్రశ్న తలెత్తుతోంది. సునిశితంగా పరిశీలించినట్టయితే జనవరి నుండి మార్చి వరకు కేవలం 156 గంటలు మాత్రమే మిషన్ పని చేసిందని ఏప్రిల్ లో  ఫిర్యాదు చేశారు. జనవరి 24 నుండి మార్చి 7 వరకు 156 గంటలు పని చేసిన మిషన్ మే 1నాటికి అదనంగా 200 గంటలకు పైగా పనిచేసినట్టుగా రీడింగ్ం స్పష్టం చేస్తోంది. కరీంనగర్ డంపింగ్ యార్డులో ఏప్రిల్ 3 నుండి మే 3 వరకు ఉన్న బయో మైనింగ్ మిషన్ కు ఆపరేటర్ లేకున్నా, తాళం చెవి లేకున్నా నిరంతరాయంగా పని చేసిందా అన్న విషయం తేల్చాల్సి ఉంది. అయితే అప్పటికే అంటే ఏప్రిల్ 4 నాటికే కరీంనగర్ మునిసిపల్ అధికారులు ఇచ్చిన బిల్లులు ఎంత..? మిషన్ ఎన్ని గంటలు పని చేసింది..? సగటున ఎంత చెత్తను ప్రాసెస్ చేసింది అన్న లెక్కలు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది.  ఒక వేళ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన తరువాత 24 గంటల పాటు ప్రాసెసింగ్ చేసేందుకు చొరవ తీసుకున్నట్టయితే అంతకు ముందు ఈ స్థాయిలో శ్రద్ద ఎందుకు కనబర్చలేదన్నది కూడా అధికారులకే తెలియాలి. నిరంతరం ప్రాసెస్ చేసేందుకు మిషనరిని ఉపయోగించిన్టయితే నిబంధనల ప్రకారం రోజుకు కనీసం ముగ్గురు ఆపరేటర్లు పని చేయాల్సి ఉంటుంది. అద్దెకు ఇచ్చిన సంస్థలతో సంబందం లేకుండా కాంట్రాక్ట్ ఏజెన్సీ సొంతగా ఆపరేటర్లను నియమించుకోవడం నిబంధనల మేరకేనా నడుచుకున్నారా లేదా అన్నది కూడాా వెల్లడించాల్సిన అవసరం ఉంది. కేసు నమోదు చేసిన తరువాత చెత్త ప్రాసెస్ చేసేందుకు మిషనరీని వినియోగించేందుకు పోలీసులు అనుమతించారా లేక అద్దెకు ఇచ్చిన కంపెనీలు అనుమతించాయా అన్నది అంతుచిక్కకుండా పోతోంది. 

Bio miningkarimnagarLatest NewsMCKTG NEWS
Comments (0)
Add Comment