దిశ దశ, హైదరాబాద్:
సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేసి ఓ బాధితురాలి నుండి భారీ ఎత్తున నగదును బదిలీ చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఓ సీనియర్ సిటిజన్ ను డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించిన సైబర్ క్రిమినల్స్ రూ. 1.6 కోట్లకు పైగా నగదను తమ అకౌంట్లకు బదిలీ చేసుకున్నారు. ఓ కంపెనీ పేరిట నకిలీ అకౌంట్ తెరిచిన క్రిమినల్స్ డిజిటల్ అరెస్ట్ చేసి నగదును బదిలీ చేయించుకున్నారు. అయితే నకిలీ అకౌంట్ ఓపెన్ చేసేందుకు సహకరించిన ఇండస్ఇండ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ను అరెస్ట్ చేశామని సీబీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంలో మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, బాధితుడి నుండి అక్రమంగా వసూలు చేసిన నగదును ఇతర అకౌంట్ల ద్వారా మళ్లించడంలో కీలకంగా వ్యవహరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామని వివరించింది. సోదాల్లో నిందితుల వద్ద డాక్యూమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.