మంచిర్యాల జిల్లాలో కార్యదర్శి అరెస్ట్…
దిశ దశ, మంచిర్యాల:
వరలక్ష్మి శుక్రవారం రోజున తన ఇంటికి లక్ష్మిదేవి వస్తుందని కలలు కన్న ఆ ఉద్యోగికి ఏసీబీ అధికారులు షాకిచ్చారు. అవినీతికి పాల్పడుతూ పంచాయితీ కార్యదర్శి జె వరలక్ష్మి ఏసీబీకి పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి జె వరలక్ష్మి రూ. 13 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కొత్తగా నిర్మించిన ఇంటికి నంబర్ కెటాయించేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేశారు పంచాయితీ కార్యదర్శి వరలక్షి. చివరకు రూ. 13 వేలు ఇస్తే ఇంటి నంబర్ కెటాయిస్తానని బాధితులతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇంటి నిర్మాణం చేసి నంబర్ కోసం పంచాయితీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న బాధితులు ఆదిలాబాద్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం పంచాయితీ కార్యదర్శి వరలక్ష్మీ బాధితుల నుండి లంచం డబ్బులు ఫోన్ పే ద్వారా పేమెంట్ చేయించుకోవడంతో అరెస్ట్ చేశారు. అయితే విలేజ్ సెక్రటరీ వరలక్ష్మి నేరుగా తన ఫోన్ పే అకౌంట్ కు కాకుండా మరో కార్యదర్శి లావణ్యకు ఫోన్ పే ద్వారా పంపించాలని సూచించారు. దీంతో బాధితులు లావణ్యకు రూ. 13 వేలు పంపించినట్టుగా నిర్దారించుకున్న ఏసీబీ అధికారులు లింగాయిపల్లి కార్యదర్శి జె వరలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఆమెను కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.