జగిత్యాల దవాఖాన పరిస్థితి…
దిశ దశ, జగిత్యాల:
జిల్లాలోనే పెద్ద దవాఖానలో రోగుల చికిత్సకు అవసరమైన పరీక్షలు చేసే విధానమే కాదు… పేషెంట్ల సహనానికి కూడా పరీక్షించే విధానం అమలవుతున్నట్టుగా ఉంది. పేదలకు పెద్ద దిక్కుగా ఉండే సర్కారు దవాఖానలో రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. ఎముకలు ఫ్యాక్చర్ అయిన వారికి తీసే ఎక్స్ రే విభాగంలో అత్యంత కీలకమైన ఫిల్మ్ కరువైపోయింది. దాదాపు నెల రోజులుగా ఇక్కడ ఎక్స్ రే ఫిల్మ్ షార్టేజ్ కావడంతో రేడియాలజీ విభాగం సిబ్బంది రోగుల స్మార్ట్ ఫోన్లలో ఫోటోలు తీసి ఇస్తున్నారు. ఎక్స్ రే సిస్టంక్ అనుసంధానం చేయడంతో కంప్యూటర్ స్క్రీన్ పై స్మార్ట్ ఫోన్ తో ఫోటోలు తీసి ఇస్తున్నారు. పేషెంట్లు తమ సెల్ ఫోన్లను తీసుకెళ్లి డాక్టర్లకు చూపిస్తే వారు చికిత్స అందిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా ఇక్కడ ఇదే తంతు సాగుతున్న ఎక్స్ రే ఫిల్మ్స్ కొనేందుకు మాత్రం చొరవ తీసుకునేవారు లేకుండా పోయారు. దీంతో ఎక్స్ రే విభాగం యంత్రాంగం స్మార్ట్ ఫోన్లలో ఫోటోలో తీసి ఇవ్వడం పేషేంట్లు వాటిని తీసుకెళ్లి డాక్టర్లకు చూపించడం సాధారణంగా మారిపోయింది.

