వాళ్లు వీళ్లేనా..? కరీంనగర్ జ్యూవెల్లరీ రాబరీ గ్యాంగ్ పై ఆరా…

దిశ దశ, కరీంనగర్:

ఆదివారం ఉదయం రాబరీకి పాల్పడి పరార్ అయిన దొంగల ముఠా గురించి పోలీసులు విభిన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. భారీ సంఖ్యలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసిన అధికారులు ముఠాల ఆచూకి గురించి వాకబు చేయాలని ఆదేశించారు. అగంతకులు కాల్పులు జరపడంతో దోపిడీ ఘటన సంచలనంగా మారింది.

ఐజీ విజిట్… 

నగల దుకాణంలో జరిగిన దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా కరీంనగర్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నగల షాపును పరిశీలించిన ఆయన దోపిడీ ముఠాను పట్టుకునేందుకు అవసరమైన ఆధేశాలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ లోనే మకాం వేసి దొంగల ముఠాను పట్టుకునేందుకు మానిటరింగ్ చేస్తున్నారు.

వాళ్లేనా..? 

అయితే బైకులపై వచ్చిన అగంతకులు శనివారం రాత్రి కరీంనగర్ చేరుకుని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడీ వద్ద పోలీసులు వెహికిల్ చెకింగ్ చేస్తున్నప్పుడు రెండు వాహనాలపై వచ్చిన వారు తప్పించుకుని పరార్ అయ్యారని తెలుస్తోంది. వాంకిడీలో తనిఖీల బృందానికి చిక్కకుండా పరార్ అయిన బైకు వాలాలే కరీంనగర్ నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

గజిబిజి… 

దోపిడీకి పాల్పడిన అనంతరం పోలీసుల దృష్టి మరల్చేందుకు పకడ్భందీగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు వివిధ రూట్లలో అనుమానితులను విచారించే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే సిరిసిల్ల వైపునకు వెళ్లారని మద్యాహ్నం అనుమానించినప్పటికీ కొంత దూరం వెళ్లిన తరువాత వారి కదలికలు కనిపించనట్టుగా సమాచారం. చొప్పదండి రూట్ లో కొన్ని ప్రాంతాల్లో వీరి అనుమానిస్తున్న రెండు బైకులు కనిపించినట్టుగా తెలుస్తోంది. దీంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ప్రత్యేక దృష్టి సారించాయి పోలీసు బృందాలు. అగంతకుల ఆచూకి దొరకలేదని పోలీసు వర్గాలు చెప్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం నుండి అనుమానితులు పట్టుబడ్డారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ అదంతా పుకారేనని పోలీసు వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. అగంతకులు చొప్పదండి వైపు వెళ్లినట్టుగా వెల్లి మార్గ మధ్య నుండి దారి మళ్లారా లేక వేరే వాహనాలను ఆశ్రయించారా అన్న విషయంపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే పోలీసు బృందాలను రంగంలోకి దింపినందున ఖచ్చితంగా అగంతకుల ఆచూకి లభ్యం అవుతుందని పోలీసు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కొత్త వారా..? 

నగల షాపులో లభ్యమైన ఆధారాలను సేకరించిన క్లూస్ టీమ్స్ గతంలో నేర చరిత్ర ఉన్న వారికి సంబంధించిన వేలిముద్రలతో పోలి ఉన్నాయా అన్న వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసు రికార్డుల్లో ఉన్న వేలిముద్రలకు, ఆదివారం కరీంనగర్ దోపిడీ జరిగిన చోట లభ్యమైన ఆధారాలు సరితూగడం లేదని తెలుస్తోంది. దీంతో కొత్త ముఠాలు ఏమైనా తయారయ్యాయా..? ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయా అన్న వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇతర రాష్ట్రాల నేరాల్లో పాల్గొన్న నిందితుల వేలిముద్రలు సరితూగనట్టయితే కొత్త వారు ముఠాగా ఏర్పడి దోపిడీలు చేయడం మొదలు పెట్టి ఉంటారని భావించాల్సి వస్తోంది. అయితే నేరం చేసిన తీరును పరిశీలిస్తే మాత్రం దోపిడీ ముఠా గ్యాంగ్ ఎక్స్ పర్ట్స్ అని తేలిపోతోందని పోలీసు వర్గాలు అంటున్నాయి.