పర్లి గ్యాంగ్ పైనే అనుమానాలు…
దిశ దశ, కరీంనగర్:
ఆదివారం కరీంనగర్ PMJ Jewellery షాపులో బారీ దొంగతనానికి పాల్పడిన ముఠా ఎలా తప్పించుకుంది..? ఏ రూట్ లో కరీంనగర్ దాటి వెళ్లారు..? ఏఏ వాహనాలు వినియోగించారు అన్న వివరాలను సేకరించే పనిలో పోలీసు బృందాలు నిమగ్నం అయ్యాయి. అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారని జరుగిన ప్రచారం వట్టిదేనని కొట్టిపారేసిన పోలీసులు ముఠా గురించి సమగ్ర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే పద్దతిలో నేరాలకు పాల్పడే ముఠాల వివరాల గురించి కూడా ఆరా తీస్తున్నారు.
నిఘా కళ్లుగప్పి..?
ఈ దోపిడీ ముఠా బైకులే కాకుండా భారీ వాహనాలను కూడా వినియోగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అపాచి, పల్సర్ వాహనాలను వాటిలో ఉంచి సేఫ్ గా తమ గమ్యం చేరుకునేందుకు స్కెచ్ వేస్తారని తెలుస్తోంది. తమ లక్ష్యం కోసం స్వస్థలాల నుండి బయలుదేరేప్పుడే కంటైనర్ లాంటి వాహనం లేదా హైటెక్ టైప్ బస్సులను వినియోగిస్తారని తెలుస్తోంది. బస్సుల్లోని లగేజిని ఉంచే చోట బైకుల టైర్లలో గాలి తీసి అందులో ఉంచుతారని, మార్గ మధ్యలో పోలీసుల కదలికలపై నిఘా వేస్తూ ముందుకు సాగుతారని తెలుస్తోంది. పోలీసుల చెకింగ్ ఉన్నట్టయితే భారీ వాహనాల్లో ఉన్న బైకులను కిందకు దింపి టైర్లలోకి గాలి ఎక్కించి సాదారణ జనం వలె పోలీసుల తనిఖీల పాయింట్లను దాటుతారని సమాచారం. ఆ తరువాత తిరిగి బైకులను భారీ వాహనాల్లోకి ఎక్కించి దోపిడీ చేయాలనుకున్న ప్రాంతానికి వెళ్లిపోతారని తెలిసింది. భారీ వాహనాలను సుదూర ప్రాంతంలో పార్క్ చేసి దోపిడీ చేసిన తరువాత బైకులను అందులోకి ఎక్కించి వెల్లిపోతారని తెలుస్తోంది. అయితే అపాచి బైక్ పై మొదట బయలుదేరినట్టయితే కొంత దూరం వెళ్లిన తరువాత పల్సర్ పై ప్రయాణిస్తారని సమాచారం. దీంతో పోలీసులు తమపై నిఘా వేసిన బైకుల గురించి అంచనా వేయలేరని తాము సేఫ్ గా గమ్యం చేరుకుంటామన్న అంచనాతోనే దోపిడీ ఈ విధంగా వ్యవహరిస్తోందని సమాచారం. ఆదివారం PMJ Jewellery షాపులో చోరీకి పాల్పడిన ముఠా కూడా ఇదే విధంగా కంటైనర్ లో పరార్ అయి ఉంటారని భావిస్తున్నారు. బైకులపై ముఠా ప్రయాణిస్తుందన్న ప్రచారం జరగడంతో ప్రతి ఒక్కరి దృష్టి కూడా ద్విచక్ర వాహనాలపై ఉంటుందని, దీంతో తాము కంటైనర్ లేదా ఇతర భారీ వాహనాల్లో జర్నీ చేసినా అనుమానం రాదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ విధంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.
పర్లీ గ్యాంగ్..?
కరీంగనర్ నగల దుకాణంలో దోపిడీకి పాల్పడింది మహారాష్ట్రలోని పర్లీ గ్యాంగ్ అయి ఉంటుందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అక్కడ నివసిస్తున్న కొన్ని కుటుంబాలు దొంగతనాలు చేయడం వారసత్వంగా సంక్రమిస్తున్నదని సమాచారం. మూడు, నాలుగు తరాలకు చెందిన వారు ఈ తరహా దోపిడీలకు పాల్పడడంలో సుశిక్షుతులయ్యారని సమాచారం. గంజాయి సేవించడం టార్గెట్ కొట్టేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని కూడా నిఘా వర్గాలు సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇంపోర్టెడ్ వెపన్స్ కూడా సేకరించగలిగే సత్తా ఉన్న ఈ గ్యాంగ్ గురించి పూర్తి వివరాలు సేకరించినట్టయితే ముఠా గుట్టు దొరికినట్టేనని భావిస్తున్నారు.
బావుపేట…
కరీంనగర్ PMJ Jewellery షాపులో దోపిడీ చేసిన తరువాత ముఠా బావుపేట నుండి మల్కాపూర్ మీదుగా జిల్లా సరిహధ్దులు దాటిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ముఠా సభ్యులు వేములవాడ లేదా జగిత్యాల రహదారిలో భారీ వాహనాన్ని పార్క్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
సాంకేతికత…
దోపిడీకి పాల్పడిన ముఠా మొబైల్ ఫోన్లు వినియోగించిందా లేదా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్ల ఆధారంగా అనుమానిత నంబర్లను గుర్తిస్తున్నట్టుగా సమాచారం. సస్పెక్టెడ్ కాంటాక్టు లిస్ట్ తయారు చేసిన పోలీసులు వాటిని ఎనలైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అనుమానిత నంబర్ల కొన్ని స్విఛ్చాఫ్ వస్తుండడం అవి ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తరువాత నుండే పనిచేయకుండా పోవడంతో ఖచ్చితంగా అవి దొంగల ముఠా సభ్యులు వినియోగించినవే అయి ఉంటాయని అనుమానిస్తున్నారు.


