దోపిడీ ముఠా సభ్యులు వీళ్లే…!

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ జ్యూవెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠాలోని నలుగురి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. జ్యోతినగర్ లోని PMJ Jewellery దుకాణంలో ఆదివారం ఉదయం 11 గంటలకు చొరబడి దోపిడీకి పాల్పడిన సంగతి తెలిసిందే. సీసీ ఫుటేజీ ఆధారంగా ముఠాకు చెందిన నలుగురి ఫోటోలను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం విడుదల చేశారు. వీరు తెలుగు, హిందీ మాట్లాడుతున్నారని జ్యూవెల్లరిలో పని చేస్తున్న సిబ్బంది చెప్పారన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని సీపీ ప్రకటించారు. ఐదుగురు ముఠా సభ్యుల్లో ఒకరు మాత్రం మాస్కు వేసుకున్నారని, వీరికి సంబంధించిన ఆధారాలను క్లూస్ టీమ్స్ సేకరించాయని తెలిపారు. ఈ ముఠా ఎక్కడికి చెందింది..? ఎక్కడి నుండి వచ్చారన్న వివరాలను సేకరిస్తున్నామని సీపీ వివరించారు.

కిందపడి… 

నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠా షాపులోపల భయానక వాతవారణం సృష్టించింది. సిబ్బందిని బెదిరించి వారి చేతులు వెనక్కి కట్టేసి, వాష్ రూంలో భయంతో దాక్కున్న మహిళను కూడా బయటకు తీసుకొచ్చి నింపాదిగా నగలను ప్యాక్ చేసుకుని వెళ్లిపోయారు. అయితే బయటకు వస్తున్న క్రమంలో షాపు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో దొంగల ముఠా తుపాకులకు పని చెప్పింది. బయటకు వచ్చిన తరువాత కూడా వారు గాలిలోకి కాల్పులు జరుపుతూ బైకుల్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయారు. ఈ క్రమంలో నగలు ఎత్తుకెళ్లుతున్న ఓ బ్యాగు అక్కడే పడిపోగా దోపిడీ ముఠా సభ్యుడు కూడా కిందపడిపోయాడని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు.

భయపడ్డారా..? 

సాధారణంగా ఇలాంటి దోపిడీలకు ప్రొఫెషనల్స్ పాల్పడుతుంటారు. అయితే కరీంనగర్ జ్యూవెల్లరీలో దోపిడీకి పాల్పడిన ముఠా కూడా అలాంటిదే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ దోపిడీ చేసి బయటకు వెల్తున్న క్రమంలో కలవరపడ్డ తీరు అంత చిక్కకుండా పోతోంది. షాపులోపల సిబ్బందిపై ఫైరింగ్ చేసిన దోపిడీ ముఠా సభ్యులు పరిగెత్తుకుంటూ వెల్తూ కాల్పులు జరపడం, వారిలో ఒకరు కిందపడి పోవడం చూస్తుంటే ఆందోళనకు గురయ్యారని స్ఫష్టం అవుతోంది. 

సిరిసిల్ల..?

దోపిడీకి పాల్పడిన మఠా రాజన్న సిరిసిల్ల జిల్లా వైపునకు పరార్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు హై అలెర్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీరి గురించి ఆరా తీసేందుకు కరీంనగర్ కమిషనరేట్ కు చెందిన పోలీసు బలగాలు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సరిహద్దులను కూడా పోలీసులు దిగ్భంధనం చేశారు.

బైకులెక్కడివో..? 

నగల షాపులో దోపిడీకి పాల్పడిన ముఠా వాడిన బైకులు ఎక్కడివి అన్న వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు పోలీసులు వాహనాల నంబర్, ఇంజన్ నంబర్ల ఆధారంగా బైకులకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు. ఈ రెండు బైకుల వివరాలు తెలిసినా దోపిడీ ముఠా గురించి స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు.

మ్యాగ్జిన్… 

కాల్పులు జరుపుకుంటూ వెలుతున్న క్రమంలో మార్గమధ్యలో పడిపోయిన మ్యాగ్జిన్, రౌండ్లపై కూడా విశ్లేషణ చేస్తున్నట్టుగా సమాచారం. కంట్రీ మేడ్ తుపాకులకు చెందినవా లేక అక్రమంగా కొనుగోలు చేసినవా, ఎక్కడైనా దొంగతనం చేసుకొచ్చారా అన్న విషయాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వివరాల వల్ల కూడా ముఠా గురించి కొంతలో కొంతైనా తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరో వైపున ముఠాకు చెందిన వారి  ఫోటోలు, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఇతర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడిన ముఠాలతో పోల్చి చూస్తున్నారు పోలీసులు. ముఠా ఏ ప్రాంతానికి చెందినదో తేలినట్టయితే వారిని గుర్తించడం సులువు అవుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.