దిశ దశ కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యువెలరీ షోరూంలో దోపిడీకి పాల్పడిన ముఠా చాలా రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు చోట్ల అడ్డా పెట్టినట్టుగా స్పష్టం అవుతోంది. ఈ సారి అనువుగా ఉన్న చోట అందినకాడికి దోచుకపోవాలన్న లక్ష్యంతోనే పావులు కదిపినట్టుగా అర్థం అవుతోంది. సెక్యూరిటీ వైఫల్యంతో పాటు అన్నింటికి అనువుగా ఉన్నట్టుగా గుర్తించిన పీఎంజే జ్యువెలరీ షోరూంను ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోంది.

పెద్దపల్లిలో…
గత నెలలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పరమేశ్వర లాడ్జీలో రెండు మూడు సార్లు అద్దెకు ఉన్న ఈ గ్యాంగ్ పెద్దపల్లితో పాటు కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో సంచరించినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు పెద్దపల్లిలో షెల్టర్ తీసుకుని సమీప ప్రాంతాల్లో దోపిడీ చేసేందుకు అనుకూలంగా ఉన్న ప్రదేశం గురించి వివరాలు సేకరించినట్టుగా అనుమానిస్తున్నారు. వీరు కేవలం కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీస్ లక్ష్యం చేసుకునేందుకు పెద్దపల్లిలో లాడ్జి అద్దెకు తీసుకోలేదని తెలుస్తోంది. పెద్దపల్లి కేంద్రంగా సమీప ప్రాంతాల్లో తిరుగుతూ దోపిడీ చేసే స్పాట్ ను ఎంచుకునేందుకు సంచరించిననట్టుగా సమాచారం.
అయితే ముఠా మాత్రం పక్కాగా ఇతర ప్రాంతాల్లో కూడా దోపిడీ చేసేందుకు తిరిగి ఉంటుందని, ఇందుకోసం ఇతర పట్టణాలు, నగరాల్లో షెల్టర్ ఏర్పాటు చేసుకుని సంచరించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో దోపిడీకి పాల్పడాలన్న లక్ష్యంతోనే వివిధ ప్రాంతాల్లో ఈ ముఠా తిరిగి ఉంటుందని భావిస్తున్నారు.
ధర్మపురి ఎందుకు..?
అయితే కరీంనగర్ లో జ్యువెలరీ షోరూంలో దోపిడీ చేయాలని నిర్దారించుకున్న తరువాత పెద్దపల్లిలో ఉండడం సరికాదని భావించి ధర్మపురిని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లికి పలుమార్లు రావడం ఒకే లాడ్జీలో ఉండడంతో కరీంనగర్ లో దోపీడికీ పాల్పడినట్టయితే తమ ఉనికి బయటపడే ప్రమాదం ఉందని ధర్మపురికి చేరుకుని ఉంటారని సమాచారం. ఆధ్యాత్మిక కేంద్రం కావడం… ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడకు తరుచూ భక్తులు వస్తుంటారని గుర్తించి ఉంటారని అనిపిస్తోంది. దీంతో పాటు ధర్మపురి నుండి పోలీసులకు చిక్కకుుండా ఈజీగా మహారాష్ట్రలోకి చేరుకోవచ్చని భావించి ఉంటారని అనిపిస్తోంది. అనుకున్నట్టుగానే ధర్మపురి నుండే కరీంనగర్ చేరుకుని దోపిడీకి పాల్పడి అందరి కళ్లుగప్పి పొరుగు రాష్ట్రాలకు చేరుకున్నారు. అయితే ముఠాను పట్టుకునేందుకు పోలీసు అధికారులు రంగంలోకి దిగినప్పటికీ వారి ఆచూకి కూడా చిక్కకపోవడం గమనార్హం.


